Israel Strikes : లెబనాన్ (Lebanon) లోని హెజ్బొల్లా (Hezbollah) భూగర్భ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది. శుక్రవారం ఇజ్రాయెల్ వైమానిక దళం లెబనాన్‌లోని పలు పర్వత ప్రాంతాల్లోగల ఉగ్రవాద హెజ్బొల్లా గ్రూప్ భూగర్భ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు.
ఈ దాడుల్లో పలువురు హెజ్బొల్లా నేతలకు సంబంధించిన ముఖ్యమైన ఆయుధ స్థావరాలను సైతం ధ్వంసం చేసినట్లు తెలిపారు. టెల్ అవీవ్ ప్రయోగించిన బంకర్ బస్టర్ బాంబులవల్ల పలు ప్రాంతాల్లోని భవనాలు దెబ్బతినగా.. అనేకమంది పాలస్తీనియన్లు గాయాలపాలైనట్లు లెబనాన్ వార్తా సంస్థ వెల్లడించింది. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రాణనష్టానికి సంబంధించిన తక్షణ సమాచారం లేదని అధికారులు పేర్కొన్నారు.
గత ఏడాది నవంబర్‌లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు చేయడంతో.. ప్రతి చర్యగా ఇజ్రాయెల్ ఆర్మీ విరుచుకుపడింది. ఆ సంస్థకు చెందిన పలు స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలోనే అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.