Tejashwi Yadav : మరో రెండు నెలల్లో బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ఓటర్ల జాబితా (Voters list) లో స్పెషల్ రివిజన్ (Special revision) ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం (Election commission of India) ప్రకటించింది. ప్రస్తుత ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేసి తుది జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
అయితే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనపై ఆర్జేడీ ముఖ్య నాయకుడు తేజస్వి యాదవ్ అసహనం వ్యక్తంచేశారు. ప్రస్తుతం 8 కోట్ల మంది బీహారీ ఓటర్లతో ఉన్న జాబితాను పక్కనపెట్టి కొత్త జాబితాను తయారుచేయడం దేనికని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉన్నప్పుడు ఈ నిర్ణయం దేనికని నిలదీశారు.
కేవలం 25 రోజుల్లో 8 కోట్ల మంది ఓటర్ల పేర్లతో జాబితాను తయారు చేయడం సాధ్యమయ్యే పనేనా అని తేజస్వి విమర్శించారు. ఆర్జేడీ పక్షాన నిలిచే పేద, బడుగు, బలహీన వర్గాల ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకే ఈ స్పెషల్ రివిజన్ అని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ కీలుబొమ్మలా ఎన్నికల సంఘం పనిచేస్తోందని మండిపడ్డారు.
ఈ విషయమై త్వరలోనే మా పార్టీ బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి మాట్లాడుతుందని తేజస్వి యాదవ్ చెప్పారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, ప్రధాని నరేంద్రమోదీలకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందని, అందుకే ఓటర్ల జాబితాలో సవరణలు చేయించి గెలువాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. వారు పేదల ఓటు హక్కును బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు.