గురుగ్రామ్: ఢిల్లీలోని గురుగ్రామ్‌లో ఓ సివిల్ ఇంజినీర్ (Civil Engineer) చేసిన పొరపాటుకు లా విద్యార్థి (Law Student) మృతిచెందాడు. న్యాయ విద్యార్థి హర్ష్ తన స్నేహితుడు మోక్ష్‌తో కలిసి ఈ నెల 24న తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఢిల్లీ-జైపూర్ హైవేలోని చంచల్ దాబాకు వెళ్లారు. అయితే అది అప్పటికే కిక్కిరిసి పోయింది. దీంతో తమ వంతు కోసం బయట వేచి ఉన్నారు. ఇంతలో హర్ష్ మరో స్నేహితుడు అభిషేక్ కూడా అక్కడికి వచ్చాడు. దీంతో ఇద్దరూ కలిసి సర్వీస్ రోడ్డు రేలింగ్ వద్ద నిలబడి మాట్లాడుకుంటున్నారు.
ఇంతలో వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో వారిద్దరు తీవ్రంగా గాయపడటంతో సమీపంలోని దవాఖానకు తరలించారు. అయితే లా స్టూడెంట్ హర్ష్ చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా, ప్రమాదం జరిగినప్పటికీ కారు ఆగకుండా వెళ్లిపోవడంతో.. స్థానికులు దానిని వెంబడించారు. కొద్ది దూరంలో కారు ఓ పక్కన ఆగి ఉన్నప్పటికీ అందులో ఎవరూ లేక పోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి.. కారు నంబర్ ఆధారంగా డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అతడిని 31 ఏండ్ల మోహిత్ అనే సివిల్ ఇంజినీర్‌గా గుర్తించారు. విధులు ముగించుకుని వెళ్తుండగా ప్రమాదం జరిగిందని ఒప్పుకున్నాడు. ఆ సమయంలో తాను నిద్రమత్తులో ఉన్నానని వెల్లడించాడు. ఈ మేరకు గురుగ్రామ్ పోలీసులు తెలిపారు.