Chenab river : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో గత కొన్ని రోజులుగా కుంభవృష్టి కురుస్తోంది. ఎడతెరపి లేకుండా వానలు పడుతుండటంతో అక్కడి నదులు (Rivers), వాగులు (Canals), వంకలు (Streams) ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చీనాబ్ నది (Chenab river) కి భారీగా వరద పోటెత్తడంతో ఉగ్రరూపం దాల్చింది. బాగ్లిహార్ (Baglihar) హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు (Hydro Electric project) పై నుంచి నది పొంగి పొర్లుతోంది.
చీనాబ్ ఉగ్రరూపం కారణంగా దోడా జిల్లాలో పలువురు గల్లంతయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దోడా-కిష్ట్వార్-రాంబన్ రేంజ్ డీఐజీ శ్రీధర్ పాటిల్.. ప్రజలకు హెచ్చరికలు చేశారు. చీనాబ్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నదని, దోడా జిల్లాలో నదిలో కొట్టుకుపోయి పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నట్టు తెలిసిందని, కాబట్టి ఎవరూ చీనాబ్ నదితోపాటు పొంగుతున్న కాలువల పరిసరాల్లోకి రావద్దని హెచ్చరించారు.
భారీ వర్షాల కారణంగా తావీ నదికి వరద పోటెత్తడంతో బుధవారం ఓ వ్యక్తి ఆ నదిలో చిక్కుకున్నాడు. దాంతో ఎస్డీఆర్ఎఫ్ అధికారులు సమయానికి అక్కడి చేరుకుని, అతడిని రక్షించారు. కాగా జమ్ముకశ్మీర్, లడఖ్, గిల్గిట్ బాల్టిస్థాన్, ముజఫరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మరో మూడు నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.