ముంబై, జూన్ 26 : అన్ని బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను త్వరితగతిన తగ్గించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ఒకటి సూచించింది. ఈ నెల ఆరంభంలో జరిగిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపోరేటును ఆర్బీఐ ఒకేసారి 50 బేసిస్ పాయింట్లు (అర శాతం) తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సమీక్షకు సంబంధించి ముఖ్యాంశాలపై ఓ కథనం విడుదలైంది. ఇందులో రెపోరేటు తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకర్లు రుణగ్రహీతలకు మరింత వేగంగా బదలాయించాల్సి ఉందని ఆర్బీఐ అభిప్రాయపడింది. నిజానికి రెపోరేటు తగ్గింపును యథాతథంగా రుణగ్రహీతలకు అందించడానికి అవసరమైన అనుకూల ఆర్థిక పరిస్థితులు ఇప్పుడున్నాయని ఆర్బీఐ జూన్ బులెటిన్లో ‘స్టేట్ ఆఫ్ ది ఎకానమీ’ పేరిట వచ్చిన ఆర్టికల్లో గుర్తుచేసింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను తగ్గించడం లేదన్నది.
ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లోనూ 25 బేసిస్ పాయింట్ల (పావు శాతం) చొప్పున రెపోరేటు తగ్గగా, చాలా బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు ఇచ్చాయి. కానీ ఆ స్థాయిలో ఇప్పుడు బ్యాంకర్లు స్పందించట్లేదని ఆర్బీఐ అంటున్నది. ఎస్బీఐ, బీవోబీ, హెచ్డీఎఫ్సీ వంటి కొన్ని బ్యాంకులు మినహా అర శాతం మేర రుణాలపై వడ్డీరేట్లను ఎవరూ తగ్గించలేదు మరి. ద్రవ్యోల్బణం గణాంకాలు ఆమోదయోగ్య స్థాయిలోనే ఉండటం, దేశ జీడీపీ గణాంకాలు మందగమనం ఛాయల్ని కనబరుస్తుండటంతో ఇటీవలి ద్రవ్యసమీక్షలో రెపోరేటును అర శాతం తగ్గించడమేగాక, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కూడా ఆర్బీఐ 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బ్యాంకుల చేతికి మరిన్ని నగదు నిల్వలు రాబోతున్నాయి. ఫలితంగా రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తే దేశ ఆర్థిక వ్యవస్థలో పురోగతి కనిపిస్తుందని, కొనుగోలుదారుల చేతికి నగదు వచ్చి మార్కెట్లో అమ్మకాలు కూడా పెరుగుతాయని ఆర్బీఐ చెప్తున్నది. మరి ఆర్బీఐ సూచనల్ని బ్యాంకర్లు ఏ మేరకు అనుసరిస్తారో చూడాల్సిందే.