Stock markets : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) వరుసగా నాలుగో రోజూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ కొనుగోళ్లు కొనసాగుతాయన్న అంచనాలతో సూచీల్లో లాభాల జోరు కొనసాగింది. ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI bank), రిలయన్స్ (Reliance) షేర్లలో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపించాయి. సెన్సెక్స్ మళ్లీ 84 వేల మార్కు దాటింది. నిఫ్టీ 25,600కు ఎగువన ముగిసింది.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఉదయం 83,774.45 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఆరంభంలో స్వల్ప ఒడిదొడుకులు ఎదుర్కొన్న సూచీ.. తర్వాత లాభాల్లోకి వెళ్లింది. ఇంట్రాడేలో 84,089.35 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరికి 303 పాయింట్ల లాభంతో 84,058.90 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 88.80 పాయింట్ల లాభంతో 25,637.80 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ట్రెంట్, ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ 68.32 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా బంగారం ఔన్స్ 3,300 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.