Elon Musk : పిల్లలను కనే అవకాశం ఉన్నవాళ్లు కనీసం ముగ్గురిని కనాలని టెస్లా సీఈఓ (Tesla CEO) ఎలాన్ మస్క్ (Elon Musk) కోరారు. అమెరికాలో జననాల రేటు (Birth rate) తగ్గుతుండటంపై మస్క్ ఆందోళన వ్యక్తంచేశారు. పలు కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గుతున్నదని, దాన్ని నివారించాలంటే సంతానం కనగలిగిన వాళ్లు కనీసం ముగ్గురికి జన్మనివ్వాలని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు.
ప్రపంచదేశాల్లో తగ్గుతున్న జనాభా స్థాయిలను నిలబెట్టడానికి మహిళలు సగటున ముగ్గురు పిల్లలను కనాలని ఇటీవల ఫార్చ్యూన్ నివేదిక పేర్కొన్నది. దాన్ని ఉటంకిస్తూ మస్క్ తాజా పోస్టు చేశారు. ఈ నివేదిక ప్రకారం ధనిక దేశాలైన అమెరికా, ఇటలీ, జపాన్ తదితర దేశాల్లో జననాల రేటు ప్రతి ఏడాది తగ్గుతోందని, దాంతో జనాభా క్రమంగా పడిపోతోందని నిపుణులు పేర్కొన్నారు. దీనిని నివారించాలంటే సంతానం కనగలిగే మహిళలు కనీసం ముగ్గురు పిల్లలను కనాలని సూచించారు.
అమెరికా లాంటి దేశాల్లో జననాల రేటు తగ్గుతుండటం వల్ల వారి నాగరికత పతనమయ్యే ప్రమాదం ఉందని మస్క్ హెచ్చరించారు. తన మాటలను నమ్మకపోతే మరో 20 ఏళ్లు వేచి చూడాలని రాసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న జనాభాపై ఐక్యరాజ్య సమితి జనాభా నిధి (UNFPA) సైతం ఆందోళన వ్యక్తంచేసింది. ఇటీవల యూఎన్ఎఫ్పీఏ విడుదల చేసిన నివేదిక.. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేట్లు క్రమంగా తగ్గుతున్నట్లు వెల్లడించింది.
పలు ఆరోగ్య సమస్యల వల్ల దాదాపు వందల మిలియన్ల మంది ప్రజలు తాము కోరుకున్నంత మంది పిల్లలను కనలేకపోతున్నారని ఏజెన్సీ పేర్కొంది. సరైన భాగస్వామి దొరకకపోవడం పిల్లలను పెంచడానికి అధిక ఖర్చులు లాంటివి కూడా కారణమవుతున్నాయని తెలిపింది. మరోవైపు సంతానోత్పత్తి రేటును తగ్గించడంలో భారత్ గణనీయమైన పురోగతిని సాధించిందని యూఎన్ఎఫ్పీఏ భారత ప్రతినిధి ఆండ్రియా ఎం వోజ్నార్ పేర్కొన్నారు.