Operation Besharat Fatah : పశ్చిమాసియా యుద్ధంలో తలదూర్చిన అమెరికాపై ఇరాన్ (Iran) ప్రతీకార దాడులు జరుపుతోంది. తమ అణుకేంద్రాలపై బాంబుల వర్షం కురిపించిన యూఎస్ఏకు బుద్ధి చెబుతామని ప్రకటించిన ఇరాన్.. సోమవారం క్షిపణులతో విరుచుకుపడింది. ‘ఆపరేషన్ బషరత్ ఫతాహ్’ (Operation Besharat Fatah ) పేరుతో ఖతార్‌లోని ఆరు అమెరికా ఆర్మీ క్యాంప్‌లే లక్ష్యంగా మిసైల్ అటాక్ చేసింది ఇరాన్ సైన్యం. అమెరికా సైనిక స్థావరాలపై మా సైన్యం క్షిపణులతో దాడికి తెగబడిందని ఆ దేశ టీవీ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దోహాలోని భారతీయులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రభుత్వం సూచించింది.
అమెరికా చేపట్టిన ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్‌కు వ్యతిరేకంగా ఇరాన్ ప్రతిదాడులకు సిద్ధమైంది. ఖతార్‌లోని అమెరికా సైనిక క్యాంపుల్ని నేలమట్టం చేయాలని మిసైళ్లతో దాడులను ముమ్మరం చేసింది. దోహాకు వెలుపల ఉన్న అల్ ఉడెడ్ ఎయిర్ బేస్‌లో అమెరికా 10 వేలమంది సైన్యాన్ని మోహరించింది. పశ్చిమాసియాలో అమెరికా ఏర్పాటు చేసిన అతిపెద్ద మిలిటరీ క్యాంప్ ఇది. ఆ ప్రాంతంలో దాడులకు ఈ క్యాంప్ ఎంతో కీలకం.
BREAKING: Iran has attacked a U.S. base in Qatar, according to a U.S. official and Iranian State TV.@IanPannell has the latest: https://t.co/ME2uXVVHvG pic.twitter.com/knZrSjiz6T
— ABC News (@ABC) June 23, 2025
దాంతో, ఇరాన్ ఆర్మీ ఈ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఖతార్ రాజధాని దోహాలో సోమవారం రాత్రి క్షిపణులతో ఇరాన్ సైన్యం దాడి చేసిందని రైటర్స్, ఏఎఫ్‌పీ వార్తా సంస్థలు వెల్లడించాయి. తమ అణుకేంద్రాలపై 125 యుద్ధ విమానాలతో 25 నిమిషాల మెరుపు దాడిలో అమెరికా ఎన్ని బాంబులను ప్రయోగించిందో.. తాము అన్నేసి బాంబులను ఉపయోగించామని ఇరాన్ సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది.