Indian Embassy : ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) దేశాల మధ్య దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయులకు అక్కడి రాయబార కార్యాలయం అడ్వయిజరీ జారీ చేసింది. దేశంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎవరూ భయాందోళనకు గురికావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
అదేవిధంగా భారత పౌరులు రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని అడ్వయిజరీలో పేర్కొంది. ‘ఇరాన్‌లోని భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులు అప్రమత్తంగా వ్యవహరించాలి. అనవసర ప్రయాణాలు మానుకోవాలి. రాయబార కార్యాలయం సోషల్ మీడియా అకౌంట్‌ను అనుసరించాలి. స్థానిక అధికారులు సూచించిన భద్రతా నిబంధనలు పాటించాలి’ అని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా తెలిపింది.
అదేవిధంగా ఒక గూగుల్ ఫాంను పోస్ట్ చేసి భారత పౌరులు తమ వివరాలను అందులో పొందుపర్చాలని సూచించింది. స్థానిక పరిస్థితులపై తాజా వివరాల కోసం ఓ టెలిగ్రామ్ లింక్‌ను షేర్ చేసింది. అదేవిధంగా హెల్ప్‌లైన్ నంబర్లను పోస్ట్ చేసింది. ఈ మధ్య ఇరాన్‌లోని అణు, ఆయుధ, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ శుక్రవారం భీకర దాడులకు పాల్పడుతోంది. దాంతో టెహ్రాన్ సైతం ప్రతీకార దాడులు చేస్తోంది.
కాగా ఇరాన్ అణు కార్యక్రమాన్ని, క్షిపణి వ్యవస్థలను సమూలంగా నిర్మూలించడమే తమ ధ్యేయమని నెతన్యాహు ఇప్పటికే స్పష్టంచేశారు. ఈ ప్రయత్నంలో ఇది ఆరంభం మాత్రమేనని, మరిన్ని వైమానిక, క్షిపణి దాడులు చేపడతామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే పౌరులు తక్షణమే ఆ ప్రదేశాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ దళాలు కోరాయి.