Israel vs Iran : ఇజ్రాయెల్-ఇరాన్ (Israel- Iran) దేశాల మధ్య పరస్పర దాడులతో పశ్చిమాసియా రగిలిపోతోంది. ఇజ్రాయెల్ దళాలు అటు గాజాపైన, ఇటు ఇరాన్‌పైన వరుస దాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. దాంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి.
ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) తన కుమారుడి వివాహం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన వివాహ వేడుకను వాయిదా వేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. నెతన్యాహు కుమారుడు అవ్నర్, అమిత్ యార్దేనీల వివాహం సోమవారం జరగాల్సి ఉంది.
ఈ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు ఆయన కుటుంబం సిద్ధమైంది. కానీ ఇరాన్లో సైనిక స్థావరాలు, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తున్నాయి. వీటికి ప్రతీకారంగా ఇరాన్ కూడా తిరిగి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తోంది. దాంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ స్థితిలో ఇంట్లో వేడుకలు చేసుకోవడం కరెక్టు కాదని నెతన్యాహు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నాటి నుంచే నెతన్యాహు కుమారుడి వివాహం అంశం వివాదాస్పదంగా మారింది. ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ప్రధాని ఇంట వేడుకలు నిర్వహిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇంతో ఇరాన్‌తో ఘర్షణలు మొదలయ్యాయి. అందుకే ఆయన తన కుమారుడి వివాహాన్ని వాయిదా వేశారు.