శనివారం 06 జూన్ 2020
International - May 24, 2020 , 01:31:44

నేపాల్‌ పాచికగా..చైనా ఆట

నేపాల్‌ పాచికగా..చైనా ఆట

 • కాలాపానీ, లిపులేఖ్‌పై పట్టుకు డ్రాగన్‌ కుట్ర
 • నేరుగా ఇండియాలోకి చొరబడవచ్చని యోచన
 • అందుకే నేపాల్‌ ప్రధానికి రాజకీయ మద్దతు
 • చైనాను చూసుకొని భారత్‌తో నేపాల్‌ కయ్యం
 • కాలాపానీ తమదేనని అధికార మ్యాప్‌ విడుదల
 • భారత్‌ ‘సుగౌలీ’ని ఉల్లంఘిస్తున్నదని ఆరోపణ
 • మానససరోవర రోడ్డు మార్గంపై అభ్యంతరాలు

చిరకాల మిత్ర దేశం నేపాల్‌ ఉన్నట్టుండి భారతదేశం మీదకు కాలు దువ్వుతున్నది. సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ సోదరభావంతో మెలుగుతున్న ఆ దేశం గత అక్టోబరులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నేపాల్‌లో పర్యటించినప్పటి నుంచి తీరు మార్చుకున్నది. వివాదాస్పదమైన కాలాపానీ ప్రాంతం మాదేనంటూ స్వరాన్ని పెంచింది. మంగళవారం(ఈ నెల 19న) ఏకంగా తమ దేశ అధికారిక పటంలో కాలాపానీని అంతర్భాగంగా చూపించింది. ఈ చర్య భారత్‌, నేపాల్‌ మధ్య ఉన్న దౌత్య సంబంధాలపై తీవ్ర చర్చకు దారి తీసింది. కాలాపానీ తమదేనని నేపాల్‌ చాలా కాలంగా వాదిస్తున్నది. అయితే ఇరు దేశాల మధ్య ఉన్న సహృద్భావ వాతావరణం కారణంగా ఈ అంశం పెద్దగా వివాదాస్పదం కాలేదు. కానీ ఇటీవల నేపాల్‌లో కమ్యూనిస్ట్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీకి చైనా మద్దతు ఉన్నది. ఇటీవల నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీలో విభేదాలు తలెత్తినప్పుడు ఓలీ రాజకీయంగా ఇబ్బందుల్లోపడ్డారు. ఈ సమస్య పరిష్కారానికి చైనా దైత్యవేత్త హౌయాన్‌క్వీ రంగంలోకి దిగి పార్టీ నాయకులతో చర్చలు జరిపారు. అదే సమయంలో జిన్‌పింగ్‌ నేపాల్‌ అధ్యక్షురాలు బిద్యాదేవి బండారీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఓలీ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. అప్పటి నుంచి నేపాల్‌ భారత్‌పై తన అక్కసును క్రమక్రమంగా వెళ్లగక్కుతున్నది. జమ్ముకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో భారత్‌ అధికారిక పటాన్ని విడుదల చేసినప్పుడు నేపాల్‌ అభ్యంతరం తెలిపింది. ‘కాలాపానీని ఇండియాలో భాగంగా చూపి సుగౌలీ ఒప్పందాన్ని ఉల్లంఘించారు’ అని ఆరోపించింది.

తాజా వివాదం ఏంటి

 భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే మానససరోవర యాత్రకు సులువుగా వెళ్లడానికి వీలుగా ఉత్తరాఖండ్‌ నుంచి లిపులేఖ్‌ కనుమ గుండా నిర్మించిన రోడ్డును రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ నెల 8న ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణంపై నేపాల్‌ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. సుగౌలీ ఒప్పందం ప్రకారం ఆ ప్రాంతం తమకే చెందుతుందని, అక్కడ భారత్‌ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని వాదిస్తున్నది. అయితే, 1962 నుంచి ఐటీబీపీ దళాలు కాలాపానీలోనే ఉన్నాయని అప్పటి నుంచి లేని అభ్యంతరం నేపాల్‌కు ఇప్పుడే ఎందుకు.. అని భారత్‌ ప్రశ్నిస్తోంది. మరోవైపు 1961లో కాలాపానీలో జనాభా లెక్కలు చేపట్టామని నేపాల్‌ చెప్తున్నది. అప్పుడు భారత్‌ కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదని వాదిస్తున్నది.

చైనాకే కీలకం

 కాలాపానీ ప్రాంతం విస్తీర్ణం కేవలం 35 చదరపు కిలోమీటర్లు. కానీ ఈ ప్రాంతం, సమీపంలోని ఓం పర్వతం, లిపులేఖ్‌ కనుమలు సరిహద్దు భద్రత పరంగా అత్యంత కీలకమైనవి. నేపాల్‌ సహాయంతో ఈ ప్రాంతాలపై చైనా పట్టు సాధించాలని చూస్తున్నది. తద్వారా తమ బలగాలు నేరుగా ఇండియాలోకి ప్రవేశించవచ్చని భావిస్తున్నది. 1962లో ఇండో- చైనా యుద్ధం జరిగినప్పుడు భారత సైనికులు ఓం పర్వతం నుంచి చైనాను నిలువరించగలిగారు. కాలాపానీకి సమీపంలోనే చైనాకు అతి ముఖ్యమైన బురాంగ్‌ సైనిక స్థావరం ఉంది. ఈ నేపథ్యంలోనే ‘నేపాల్‌ ఇతరుల ప్రయోజనాల కోసం అలా వ్యవహరిస్తున్నది’ అని భారత ఆర్మీ చీఫ్‌ నరవణే  అన్నారు. లిపులేఖ్‌ పాస్‌ వాణిజ్యపరంగా కూడా కీలకమైనది. మరోవైపు ఇటీవల ఓలీ మాట్లాడుతూ లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురాలు తమవేనని, రాజకీయ దౌత్యపరమైన మార్గాల ద్వా రా తిరిగి స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు.

సుగౌలీ ఒప్పందం ఏమిటి?

ఇండియా, నేపాల్‌ సరిహద్దుపై 1816లో అప్పటి బ్రిటిష్‌ ఇండియా, నేపాల్‌ రాజు మధ్య సుగౌలీ ఒప్పందం జరిగింది. కాళీ నదిని రెండు దేశాల మధ్య సరిహద్దుగా నిర్ణయించారు. అయితే కాళీ నది ఉపనదులను కూడా పరిగణలోకి తీసుకోవాలని, అలా చేస్తే కాలాపానీ తమ దేశం పరిధిలోకి వస్తుందని నేపాల్‌ వాదిస్తున్నది. అయితే భారత్‌ మాత్రం నదిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని చెప్తున్నది. ఈ నేపథ్యంలోనే సరిహద్దు వివాదం నెలకొన్నది.  అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే భారత్‌, నేపాల్‌ మధ్య 1950లో శాంతి ఒప్పందం జరిగింది. అప్పుడు సుగౌలీ సహా బ్రిటిష్‌ ఒప్పందాలను రద్దు చేయాలని నిర్ణయించారు. అప్పుడే ఆ ఒప్పందానికి కాలం చెల్లింది.

వివాదంలో కీలక ఘటనలు 

 • 1816: బ్రిటిష్‌ ఇండియా, నేపాల్‌ మధ్య సుగౌలీ ఒప్పందం.
 • 1950- భారత్‌, నేపాల్‌ మధ్య శాంతి ఒప్పందం. 
 • 1962- ఇండో-చైనా యుద్ధం. భారత్‌ కాలాపానీ వద్ద సైనిక స్థావరాలను ఏర్పాటు.
 • 2015- మానససరోవర యాత్ర, లిపులేఖ్‌పై ఇండియా, చైనా మధ్య ఒప్పందం.
 • 2019- జమ్ముకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా కాలాపానీ భారత్‌లో అంతర్భాగంగా పటం విడుదల.
 • 2020 మే 8- మానస సరోవర యాత్రకు వెళ్లేందుకు ఉత్తరాఖండ్‌ నుంచి లిపులేఖ్‌ పాస్‌ ద్వారా నిర్మించిన రోడ్డు ప్రారంభం
 • 2020 మే 23- కాలాపానీ తమదేనంటూ నేపాల్‌ పటం విడుదల.


logo