సార్వత్రిక సమరంలో ప్రజా చైతన్యం వెల్లివిరిసింది. పోలింగ్ కేంద్రాలకు ఇందూరు ప్రజా ‘ఓటెత్తింది’. ఎప్పటిలాగే పట్టణాల కన్నా పల్లెల్లోనే పోలింగ్ ఎక్కువగా నమోదైంది. చెదురుమదురు ఘటనలు మినహా నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లలో సోమవారం ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. అభివృద్ధి పనులు చేపట్టడం లేదని కొన్ని తండాల్లో ఎన్నికలను బహిష్కరించారు.
అధికారులు హుటాహుటిన వెళ్లి వారిని సముదాయించి ఓటింగ్‌ను ప్రారంభించారు. రాత్రి 10 గంటల వరకు ‘నిజామాబాద్’లో 71.47 శాతం, జహీరాబాద్‌లో 72.48 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారనున్నదనే అంశంపై జోరుగా చర్చ సాగుతున్నది. జూన్ 4వ తేదీన ప్రజాతీర్పు వెలువడనున్నది.
లోక్‌సభ ఎన్నికల్లో జనం ‘ఓటెత్తారు’. తొలి రెండు గంటలు మందకొడిగా సాగిన పోలింగ్.. తొమ్మిది గంటల తర్వాత ఊపందుకుంది. సాయంత్రం వరకూ అదే రద్దీ కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం ఆరు దాటిన తర్వాత కూడా ఓటర్లు లైన్లో ఉండడంతో వారికి ఓటేసే అవకాశం కల్పించారు. మొత్తానికి చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రధానంగా పల్లెల్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో జనం బారులు తీరగా, పట్టణ వాసులు సైతం ముందుకొచ్చారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. చల్లబడ్డ వాతావరణం కూడా పోలింగ్ పెరగడానికి కారణమైంది.
ఉదయం వేళ కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించగా, అధికారులు వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటుచేసి ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. తొలుత మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ తొమ్మిది గంటల తర్వాత జోరందుకుంది. ప్రధానంగా యువతతో పాటు మహిళలు, వృద్ధులు ఓటేయడానికి తరలివచ్చారు. దీంతో పోలింగ్ కేంద్రాలన్నీ కిటకిటలాడాయి. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం ఆరు తర్వాత కూడా ఓటర్లు లైన్లో ఉండడంతో వారికి ఓటేసే అవకాశం కల్పించారు. అక్కడక్కడ వివిధ పార్టీల నేతల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరుగగా పోలీసులు వారిని చెదరగొట్టారు. మొత్తానికి పటిష్ట భద్రత నడుమ పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ, బోధన్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ నిర్వహించగా, ఒక్క నిజామాబాద్ అర్బన్ మినహా మిగిలిన సెగ్మెంట్లలో ఓటర్లు బారులు తీరారు. ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో సగటున 70 శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా, అర్బన్‌లో మాత్రం 61.85 శాతానికే పరిమితమైంది. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించిన జహీరాబాద్ లోక్‌సభ స్థానంలోనూ ఓటింగ్ శాతం పెరిగింది. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ అసెంబ్లీ సెగ్మెంట్లలోని పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిటకిటలాడాయి. అయితే, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ సగటు 70 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కాగా, కామారెడ్డిలో 71.41 శాతం పోలింగ్ జరిగింది.
గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. 2019 ఎన్నికల్లో మొత్తం 68.10 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈసారి 70 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో ఏకంగా 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 29 మంది అభ్యర్థులు ఉండగా, ప్రధాన పోటీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే కొనసాగింది. పెరిగిన ఓటింగ్ శాతంపై ఎవరికి వారు తమకే అనుకూలమని అభ్యర్థులు చెబుతున్నప్పటికీ, కౌంటింగ్ రోజు వరకూ ఈ సస్పెన్స్ కొనసాగనున్నది.
కామారెడ్డి,మే 13: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్‌లో పోలింగ్ కేంద్రాల్లో విధులను నిర్వర్తిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై పోలీసు అధికారి సుబ్రహ్మణ్యం విచక్షణారహితంగా మాట్లాడడంపై నిరసనగా విధులను బహిష్కరించారు. ఐసీడీఎస్ అధికారులకు పోలింగ్ బూత్‌లో ఏం పని అంటూ మాట్లాడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలించారు. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను డిచ్పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ కళాశాల (సీఎంసీ)లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్‌కు తీసుకొచ్చారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలోని దూర ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులు అర్ధరాత్రి తర్వాత డిచ్పల్లికి చేరుకున్నారు. నెలన్నర పాటు సాగిన సార్వత్రిక సమరంలో తుది అంకం ముగియగా, జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
గాంధారి/ దోమకొండ/ నవీపేట/ బిచ్కుంద/డిచ్పల్లి/ వర్ని, మే 13: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. వెంటనే స్పందించిన ఎన్నికల అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ యథావిధిగా కొనసాగింది. గాంధారి మండల కేంద్రంలోని 26వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పనిచేయకపోవడంతో దాదాపు గంట సేపు ఓటింగ్ నిలిచిపోయింది. దోమకొండ మండలం ముత్యంపేట పంచాయతీ పరిధిలోని పోలింగ్ స్టేషన్లో ఈవీఎం మొరాయించడంతో వెంటనే స్పందించిన ఎన్నికల పరిశీలకులు మరో ఈవీఎంను ఏర్పాటు చేశారు.
నవీపేట మండల కేంద్రంతోపాటు రాంపూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఇతర ఈవీఎంలను ఏర్పాటు చేయగా పోలింగ్ కొనసాగింది. బిచ్కుంద మండల కేంద్రంలోని బూత్‌నంబర్ 128లో ఈవీఎం మొరాయించడంతో గంటపాటు పోలింగ్ ప్రక్రియ నిలిచింది. డిచ్పల్లి మండలం ఘన్పూర్, ధర్మారం, ముల్లంగి గ్రామాల్లో పోలింగ్ ప్రారంభంలోనే ఈవీఎంలు మొరాయించడంతో అరగంటపాటు పోలింగ్ నిలిచింది. సిబ్బంది ఈవీఎంలను సరిచేయడంతో పోలింగ్ ప్రారంభమైంది. వర్ని మండలం తగిలేపల్లిలో ఈవీఎం మొరాయించడంతో సుమారు గంటపాటు పోలింగ్ నిలిచింది.
బోధన్ రూరల్, మే 13: బోధన్ మండలం కొప్పర్గ గ్రామంలో రాత్రి 8.20 నిమిషాల వరకు పోలింగ్ కొనసాగింది. గంటన్నర పాటు ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ నిలిచింది. మొత్తం 1240 ఓటర్లకు 1009 మంది ఓట్లు వేశారు. ఈవీఎంలు పనిచేయకపోవడంతో క్యూలో ఉన్న 220మందికి టోకెన్లు జారీ చేసి ఓట్లు వేయించారు.