Gaza : గాజా (Gaza) నగరంలో తీవ్ర కరవు (Famine) పరిస్థితి నెలకొందని ఐక్యరాజ్యసమితి (UNO) శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (IPC) అందించిన నివేదిక ఆధారంగా ఐరాస ఈ ప్రకటన చేసింది. గాజా నగరంతో సహా దాదాపు 20 శాతం ప్రాంతంలో కరవు పరిస్థితులు ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. వెంటనే కాల్పుల విరమణ జరిగి, మానవతా సాయం అందకపోతే ఖాన్ యూనిస్, దీర్ అల్-బలా వంటి దక్షిణ ప్రాంతాలకు కూడా ఈ సంక్షోభం విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించినట్లు పేర్కొంది.
మధ్యప్రాచ్య చరిత్రలో ఒక ప్రాంతంలో కరువును ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే ఈ నివేదికను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఇదంతా హమాస్ ప్రచారం చేస్తున్న అబద్ధమని కొట్టిపారేసింది. దాంతో గాజాలో వాస్తవ పరిస్థితులపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జెనీవాలో జరిగిన సమావేశంలో ఐరాస సహాయ ప్రధాన అధికారి టామ్ ఫ్లెచర్ మాట్లాడుతూ.. ఇది పూర్తిగా నివారించదగిన కరవు అని అన్నారు.
ఇజ్రాయెల్ క్రమపద్ధతిలో అడ్డంకులు సృష్టించడం వల్లే సరిహద్దుల్లో ఆహార సరఫరా నిలిచిపోయిందని ఫ్లెచర్ ఆరోపించారు. ఇది మనందరినీ వెంటాడే కరవని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధంలో ఆకలిని ఒక ఆయుధంగా ఉపయోగించడం యుద్ధ నేరమని ఐరాస మానవ హక్కుల అధికారి వోల్కర్ టర్క్ విమర్శించారు. కాగా గాజాలో కరవు లేదని, గాజాలో కరువు ఉన్నట్లు చెబుతున్న నివేదిక హమాస్ చెబుతున్న అబద్ధాలపై ఆధారపడి ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది.
గాజాకు సహాయ సరఫరాను పెంచేందుకు తాము అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఇజ్రాయెల్ సైనిక సంస్థ ‘కోగాట్’ తెలిపింది. కాగా ఒక ప్రాంతంలో కరువును ప్రకటించాలంటే ఐపీసీ కొన్ని కఠినమైన నిబంధనలను పాటిస్తుంది. జనాభాలో కనీసం 20 శాతం కుటుంబాలు తీవ్ర ఆహార కొరతను ఎదుర్కోవడం, 30 శాతం చిన్నారులు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడటం, ప్రతి 10,000 మందిలో ఇద్దరు పెద్దలు లేదా నలుగురు చిన్నారులు ఆకలితో మరణించడం లాంటివి ఈ నిబంధనలలో ముఖ్యమైనవి. గాజాలో ఈ పరిస్థితులు ఉన్నాయని ఐపీసీ నిర్ధారించింది.
కాగా ఘర్షణల కారణంగా మరణాల సంఖ్యను కచ్చితంగా ధృవీకరించడం కష్టమైందని నిపుణులు చెబుతున్నారు. గతంలో సోమాలియా, దక్షిణ సూడాన్ లాంటి దేశాల్లో కరవును ప్రకటించినా, మధ్యప్రాచ్యంలో ప్రకటించడం ఇదే తొలిసారి. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత మొదలైన ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 60 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.