PM Bodyguard : ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Naredra Modi) మాజీ బాడీగార్డ్ (Ex-Bodyguard), రా ఏజెంట్‌గా పనిచేసిన లక్కీబిష్త్ (Lucky Bisht) నటుడిగా అరంగేట్రం చేశారు. ‘సేన – గార్డియన్స్ ఆఫ్ ది నేషన్ (Sena-Guardians Of The Nation)’ వెబ్‌సిరీస్‌లో అతిథి పాత్రలో ఆయన మెరిశారు. మేకర్స్ ప్రత్యేక ఆహ్వానం మేరకు తాను అందులో నటించినట్లు వెల్లడించారు.
‘నిజమైన సైనికుడిని తెరపై చూపించాలని మేకర్స్ భావించారు. నా మిలిటరీ నేపథ్యం, అనుభవం దృష్ట్యా ఆ అవకాశం ఇచ్చారు. ఈ నటన నాకు పూర్తిగా కొత్త. కానీ కొత్త అనుభవాన్ని ఇచ్చింది. నిజ జీవితంలో మన విధులను మనం నిర్వర్తిస్తాం. క్షేత్రస్థాయిలో సైనికుడిగా ఉన్నప్పుడు మన భుజాలపై ఎంతో బాధ్యత ఉంటుంది. నిజమైన యుద్ధాల్లో మన త్యాగాలు, భయాలు అన్నీ ఉంటాయి. సైనికుడిగా నటించడం అంటే అలాంటి ఉద్వేగాలనే కెమెరా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాలి’ అని లక్కీ బిష్త్ మీడియాతో తన కొత్త జర్నీ గురించి చెప్పారు.
‘సేన-గార్డియన్స్ ఆఫ్ ది నేషన్’ ఎంఎక్స్ ప్లేయర్లో స్ట్రీమింగ్ అవుతోంది. విక్రమ్ సింగ్ చౌహాన్ ప్రధాన పాత్రలో నటించారు. యశ్పాల్ శర్మ, షిర్లే సేథియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో కార్తీక్ అనే యువకుడు అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి భారత సైన్యంలో చేరి, దేశానికి సేవ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన మిలిటెంట్లను ఎదుర్కొన్న తీరును దర్శకుడు అభినవ్ ఆనంద్ ఈ సిరీస్‌లో చక్కగా చూపించారు.
కాగా ఉత్తరాఖండ్‌కు చెందిన లక్కీ బిష్త్ భారత మాజీ స్పై, స్నైపర్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండో. ఆయన ప్రముఖ నేతలు ఎల్కే అడ్వాణీ, రాజ్‌నాథ్ సింగ్, తరుణ్ గొగోయ్ లాంటి వారికి బాడీగార్డ్‌గా పనిచేశారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. 2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మన దేశంలో పర్యటించినప్పుడు భద్రత పర్యవేక్షించిన అధికారుల్లో బిష్త్ కూడా ఒకరు.
భారత సైన్యం, రా, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, అస్సాం రైఫిల్స్ లాంటి ఏజెన్సీల్లో పనిచేసిన ఆయన దేశం తరఫున పలు ఆపరేషన్లలో పాల్గొన్నారు.