హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఖాళీ కాబోతున్న రెండు రాజ్యసభ స్థానాలకు అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో టీపీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు జగ్గారెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో త్వరలో భర్తీకానున్న రాజ్యసభ సీట్లను కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు వీ హనుమంతరావు, జెట్టి కుసుమకుమార్‌కు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు.
వీ హనుమంతరావుకు రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన అనుభవం ఉన్నదని, మూడు ప ర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారని గుర్తుచేశారు. జెట్టి కుసుమకుమార్ యూత్ కాంగ్రెస్ లీడర్‌తోపాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడైనందున అవకాశం ఇవ్వాలని కోరినట్టు పేర్కొన్నారు. జెట్టి కుసుమకుమార్ కుటుంబం సమరయోధుల కుటుంబమని.. వారి కుటుంబమంతా కాంగ్రెస్‌లోనే ఉన్నారని చెప్పినట్టు తెలిపారు. తన ప్రతిపాదనపై చర్చిస్తామని ఖర్గే హామీ ఇచ్చినట్టు జగ్గారెడ్డి వెల్లడించారు.