Hunger deaths : ఇజ్రాయెల్ బలగాల దిగ్బంధనంలో విలవిల్లాడుతున్న గాజా ప్రాంతంలో ఆకలి చావుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 48 గంటల్లో ఈ ప్రాంతంలో 20 మంది ఆకలితో మరణించారని హమాస్ మంగళవారం ప్రకటించింది. ఇది దిగ్భ్రాంతికర పరిణామమని పాలస్తీనాలో హమాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆరోగ్యశాఖ డైరెక్టర్ మునీర్ అల్ బరష్ అన్నారు.
గాజాలో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి మొత్తం 88 మంది ఆకలి చావులకు గురయ్యారనీ, వారిలో 20 మంది గత రెండు రోజుల్లోనే మృతిచెందడం విషమిస్తున్న పరిస్థితికి అద్దంపడుతోందని బరష్ ఆవేదన వ్యక్తంచేశారు. కాగా గాజాలో ఇప్పటివరకు తీవ్ర పోరాటానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లోకి ఇజ్రాయెల్ బలగాలు చొచ్చుకుపోతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం యథేచ్ఛగా మారణహోమం కొనసాగిస్తోంది.