హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని, కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న అధికారులంతా అప్పుడు సెట్ రైట్ అవుతారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రీ ఫైనల్ లాంటివని, కేటీఆర్ టికెట్ ఎవరికి ఇచ్చినా వారిని గెలిపించుకోవాలని పార్టీ క్యాడర్‌కు సూచించారు. వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు భారీ సంఖ్యలో ఇవాళ బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ వారిని పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించి చెప్పాలన్నారు. పాలిచ్చే బర్రెను పక్కనపెట్టి ఎగిరితన్నే దున్నపోతును తెచ్చుకున్నట్టు అయిందని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని కేటీఆర్ చెప్పారు. ఆరు గ్యారంటీల పేరుతో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇవాళ తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేసిందన్నారు. మీసేవ కార్యాలయాల్లో ఇచ్చే రేషన్ కార్డులను జారీచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపెద్ద సభల్లో గప్పాలు కొట్టుకుంటున్నాడని విమర్శించారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా గెలువండి. మిమ్మల్ని ఏ అధికారి వేధించడు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న అంతులేని వ్యతిరేకతను అందిపుచ్చుకోవాలి. అభ్యర్థితో సంబంధం లేకుండా కారు గుర్తుకు ఓటువేసే లాగా ప్రజలను చైతన్యపరిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, జిల్లా పరిషత్ స్థానం బీఆర్ఎస్దే అవుతుంది. సమైక్య పాలనలో తెర్లు అయిన తెలంగాణను బాగు చేయాలన్న లక్ష్యంతో పదేండ్లు అధికారంలో ఉండి దీక్షగా పనిచేశాం. కేసీఆర్ నాయకత్వంలో ఓ తపస్సులాగా తెలంగాణలోని సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం పాటుపడ్డాం. ఆనాడు ప్రజల కోసం పనిచేస్తూ పార్టీ నాయకులను పట్టించుకోకపోవడం వాస్తవం. రేపు అధికారంలోకి వచ్చాక గతంలో చేసిన తప్పును పునరావృతం చేయం. అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యకర్తలు, నాయకులను కళ్లలో పెట్టుకుని చూసుకుంటాం’ అన్నారు.
‘వికారాబాద్ ప్రజల దశాబ్దాల స్వప్నమైన జిల్లాను ఏర్పాటు చేసి సరిగా చెప్పుకోలేపోయాం. వికారాబాద్‌కు మెడికల్, నర్సింగ్ కాలేజీ వస్తుందని కలలో కూడా ఎవరూ అనుకోలేదు. కానీ కేసీఆర్ దాన్ని సాకారం చేశారు. పెన్షన్లు 2000 అవుతాయని, రైతుబంధు ఠంచన్‌గా పడుతుందని, రుణమాఫీ అవుతుందని, రైతు బీమా చేస్తారని, బాలింతలకు కేసిఆర్ కిట్ ఇస్తామని ఎవరూ ఊహించలేదు. కానీ అవన్నీ చేసి చూపించాం. అయితే వాటిని సరిగా ప్రజలకు చెప్పుకోలేకపోయాం. ఆడబిడ్డలకు 300 కోట్ల రూపాయలు వడ్డీలేని రుణాలను ఇచ్చి ఏదో ఘనకార్యం చేసినట్టు కాంగ్రెస్ సంబురాలు చేసుకుంటుంది. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడబిడ్డలకు 3000 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు ఇచ్చారు. కానీ ఏనాడూ దాన్నొక గొప్ప పనిలాగా చెప్పుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కాని అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు 6.5 లక్షల రేషన్ కార్డులను అర్హులకు ఇచ్చాం. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 90 వేల కార్డులు ఇచ్చాం. అయితే ఈ పనులు అన్నింటిని ఏవో ఘనకార్యాలుగా మేము ఎన్నడూ భావించలేదు. ప్రజలకు రొటీన్‌గా చేసేవే అనుకున్నాం. అయితే మీసేవ సెంటర్లో ఇచ్చే రేషన్ కార్డులకు కూడా ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపెద్ద సభలు పెట్టి చెప్పుకుంటున్నాడు’ అని కేటీఆర్ విమర్శించారు.
‘ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసింది. పెన్షన్ తీసుకునే పెద్దమనుషులకు రేవంత్ రెడ్డి 40 వేల రూపాయలు బాకీ ఉన్నాడు. ఆడపిల్లలకు ఐదు లక్షల భరోసా కార్డు, స్కూటీలు, నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. కానీ ఏమి చేయలేదు. ప్రస్తుతం తెలంగాణలోని ప్రతీ ఆడబిడ్డకు రేవంత్ రెడ్డి 50 వేల రూపాయలు బాకీ ఉన్నాడు. రాహుల్ గాంధీ ఫోటోతో గ్యారెంటీ కార్డులు ఇచ్చి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నాయకులు అరచేతిలో వైకుంఠం చూపించారు. పాలిచ్చే బర్రెను పక్కనపెట్టి ఎగిరితన్నే దున్నపోతును తెచ్చుకున్నట్టు అయిందని ఇవాళ ప్రజలు బాధపడుతున్నారు. తెలంగాణలోని ప్రతి వర్గం కాంగ్రెస్ చేతిలో మోసపోయింది. రెండు లక్షల వరకు రుణమాఫీ, రైతుబంధు 1,5000, వడ్లకు బోనస్, కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఇవాళ తప్పించుకుని తిరుగుతున్నడు. 11 సార్లు రైతుబంధు వేసి ఏనాడు కేసీఆర్ రాజకీయం చేయలేదు. అన్నదాతలకు న్యాయం చేశామనే అనుకున్నారు. నాట్లు వేసేటప్పుడు ఇవ్వకుండా ఓట్లువేసే టైముకు రేవంత్ రెడ్డి రైతుబంధు వేస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన 20 నెలలో ఒకసారి మాత్రమే రైతుబంధువేసి దానికి సంబరాలు చేసుకోవాలని చెప్తున్నాడు’ అని మండిపడ్డారు.
‘ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి పత్తా లేకుండా పోయాడు. ముఖం బాగా లేక అద్దం పగలగొట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. ఆయనకు పాలన చేతగాక సమర్థత లేక రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం చేతకాని దద్దమ్మ రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక కేసీఆర్‌ను నిందిస్తున్నాడు. కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిన సమయంలో కూడా పెన్షన్, రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను కేసీఆర్ టైమ్‌కు ఇచ్చారు. ఎంత కష్టం, ఇబ్బంది ఉన్నా బయటికి కనిపించకుండా ఒక తండ్రి లాగా రాష్ట్ర ప్రజలను కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఈసారి వికారాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్‌కు పోకుండా అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరేలా ప్రతి కార్యకర్త పనిచేయాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
‘చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. గుర్రం విలువ తెలియాలంటే గాడిదలను చూడాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరు గుర్రాలో, ఎవరు గాడిదలో ప్రజలకు అర్థం అయింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రీఫైనల్ లాంటివి. ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. మా కోసం కష్టపడ్డ క్యాడర్‌ను మేం గెలిపించుకుంటాం. ఇంటింటికి తిరిగి కడుపులో తలకాయ పెట్టి ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాలను వివరించి చెప్పాలి. రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పని చేస్తున్నారు. బాల్కొండ పోలీస్ స్టేషన్లోనే కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టడం సిగ్గుచేటు. మల్కాజ్ గిరిలో గుండాలు రోడ్డు మీద షో చేస్తే పోలీసులు ఏమి చేయలేక చేతులు ముడుచుకొని కూర్చున్నారు. మళ్లీ వికారాబాద్ జిల్లాలో గులాబీ జెండాను ఎగురవేయాలి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నికవుతారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డి ఎగిరి పడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు.