Nepal Floods | పొరుగుదేశం నేపాల్ (Nepal)ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు (Nepal Floods) సంభవించాయి. ఈ వరదలకు రాజధాని ఖాట్మాండు (Kathmandu) సహా ఎనిమిది జిల్లాల్లో 50 మంది ప్రాణాలు కోల్పోయారు.
స్థానిక మీడియా నివేదిక ప్రకారం.. ఖాట్మాండులో 11 మంది, లలిత్‌పూర్‌లో 16 మంది, భక్తపూర్లో ఐదుగురు, కవ్రేలో ఆరుగురు, సింధుపాల్‌చోక్‌లో ఇద్దరు, పంచ్తార్లో ఐదుగురు, ధన్కూటలో ఇద్దరు, సింధులి, ఝాపా, ధాడింగ్‌లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 50 మంది మరణించారు. సుమారు 12 మంది గల్లంతైనట్లు ఖాట్మాండు మీడియా నివేదించింది.
భారీ వర్షాలకు దాదాపు అన్ని నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఆ నీరంతా సమీపంలోని గ్రామాల్లోకి పోటెత్తింది. దీంతో అనేక ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకుపోయాయి. దాదాపు 1,244 ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. దేశవ్యాప్తంగా 44 జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించినట్లు సదరు మీడియా పేర్కొంది. పలు చోట్ల కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నట్లు తెలిపింది. దీంతో పలు చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయని.. ఈ కారణంగా 39 జిల్లాల్లో రహదారులను అధికారులు పూర్తిగా మూసివేసినట్లు వెల్లడించింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టినట్లు స్థానిక మీడియా తెలిపింది. దాదాపు 3 వేల మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకూ వెయ్యి మంది వరకు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది.
Also Read..
Hassan Nasrallah | 80 టన్నుల బాంబులతో.. నస్రల్లాను అంతమొందించిన ఇజ్రాయెల్..!
Hezbollah | తాజా దాడుల్లో హిజ్బొల్లా చీఫ్ నస్రల్లా హతం.. ప్రకటించిన ఇజ్రాయెల్