YouTuber | ఒకప్పుడు ఆమె లండన్‌లో ఓ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ (Ex Investment Banker). ఆ రంగంలో దాదాపు పదేళ్ల అనుభవం. మంచి జీతం.. ఉద్యోగ జీవితంలో మరింతగా పైకి ఎదిగే అవకాశం. కానీ వాటన్నింటినీ వదులుకొని రిస్క్ తీసుకుంది. ఉద్యోగ జీవితానికి ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పెట్టేసి.. యూట్యూబ్ బాట (YouTuber) పట్టింది. ఏడాది తిరిగేసరికి ఉద్యోగ జీవితంలో సంపాదించిన డబ్బుకన్నా నాలుగు రెట్లు ఎక్కువగా సంపాదించేసింది. ఆసక్తి, ఆలోచన, తెలివితేటలు ఉంటే అసాధ్యం అనుకున్న వాటిని కూడా సుసాధ్యం చేయొచ్చని నిరూపించింది. ఆమె పేరే నిశ్చా షా (Nischa Shah).
నిశ్చాది ఉరుకుల పరుగుల జీవితం. ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్‌గా ఏడాదికి రూ.2 కోట్ల దాకా సంపాదించేది. దాదాపు తొమ్మిదేళ్లపాటు ఆ ఉద్యోగంలో కొనసాగింది. కానీ తనకు అది సంతృప్తినివ్వలేదు. చేస్తున్న ఉద్యోగంలో సవాళ్లేమీ లేకపోవడం, తెలివితేటలను పెంచేదిగా లేకపోవడంతో ఆమెకు ఆ పని నచ్చలేదు. పైగా ఇతరులకు సాయం చేస్తూ ఆర్థికంగా ఎదగాలనుకునే మనస్తత్వం ఆమెది. తాను చేస్తున్న బ్యాంక్ ఉద్యోగం కార్పొరేషన్లకు, ప్రభుత్వాలకు మాత్రమే సాయపడుతోందని గ్రహించింది. సాధారణ ప్రజలకు సాయం చేసేలా ఏదైనా చేయాలనుకుంది. అలా పుట్టుకొచ్చిందే యూట్యూబ్.
ఉద్యోగానికి రాజీనామా చేయడానికి ముందే నిశ్చా యూట్యూబ్‌ను ప్రారంభించింది. అయితే, మొదట్లో 1,000 సబ్‌స్ర్కైబర్ల మార్క్‌ని అందుకోవడానికి ఆమెకు ఏకంగా 11 నెలల సమయం పట్టింది. ఎప్పుడైతే ఆమె 2022 సెప్టెంబర్‌లో తన జీవితంపై ఓ వీడియో అప్లోడ్ చేసిందో అప్పుడు ఆమె జీవితమే మారిపోయింది. ఆ వీడియో బాగా వైరల్ అవ్వడంతో.. 50 వేల మంది సబ్‌స్ర్కైబర్లు వచ్చేశారు. అంతేకాదు.. యూట్యూబ్ నుంచి రూ.3 లక్షలు కూడా అందుకుంది. అప్పుడే తాను ఫుల్‌టైమ్ యూట్యూబర్‌గా మారాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా.. 2023 జనవరిలో తన బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసేసింది.
యూట్యూబ్‌లో పర్సనల్ ఫైనాన్స్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు ఇస్తూ వీడియోలు చేయడం ప్రారంభించింది. అంతే ఏడాది తిరక్కుండానే ఉద్యోగ జీవితంలో సంపాదించిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆదాయాన్ని అర్జించింది. గతేడాది మే నెల నుంచి 2024 మే మధ్య ఏకంగా రూ.8 కోట్లు సంపాదించి తాను తీసుకున్న నిర్ణయం సరైందేనని నిరూపించింది. పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు, ఉత్పత్తులు, ప్రముఖులతో ఇంటర్వ్యూలు, ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామ్యాల ద్వారా ఈ ఆదాయాన్ని ఆర్జించింది.
ఇప్పుడు ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ‘ఇతరులకు సాయం చేస్తూనే ఆర్థికంగా ఎదగాలని భావించా. కానీ అప్పటివరకు నేను చేసిన పని కేవలం కార్పొరేషన్లు, ప్రభుత్వాలకు మాత్రమే ఉపయోగపడింది. అందుకే 2023 జనవరిలో ఉద్యోగానికి రాజీనామా చేసి యూట్యూబ్‌లో పర్సనల్ ఫైనాన్స్‌కు సంబంధించిన కంటెంట్ క్రియేటర్‌గా మారా’ అని నిశ్చా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Also Read..
London Bonalu | లండన్‌లో ఘనంగా టాక్ బోనాల జాతర.. ప్రత్యేక ఆకర్షణగా పోతురాజు విన్యాసాలు
Chandrababu | నా కాళ్లకు ఎవరూ దండం పెట్టొద్దు.. చంద్రబాబు కీలక సూచన