Chandrababu | కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వదిలేయాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే.. తిరిగి వారి కాళ్లకు దండం పెడతానని తెలిపారు. అమరావతిలోని ఎన్టీఆర్‌భవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు శనివారం వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఇవాల్టి నుంచి నా కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్స్టాప్ పెడుతున్నానని చెప్పారు. తల్లిదండ్రులు, భగవంతుడి కాళ్లకు మాత్రమే దండం పెట్టాలి తప్ప నాయకుల కాళ్లకు కాదని స్పష్టంచేశారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని హితవు పలికారు. మీడియాతో చిట్‌చాట్ అనంతరం కార్యకర్తలు, ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు.
అంతకుముందు గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉంటుందని తెలిపారు. మంచి చేసే వారంతా ముందుకు రావాలని అన్నారు. మంచి చేయాలని అనుకునేవాళ్లకు ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవని పేర్కొన్నారు. అక్షయపాత్ర స్ఫూర్తితో అతి త్వరలోనే ఏపీలో అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తామని చంద్రబాబు తెలిపారు. హరేకృష్ణ సంస్థ దైవ సేవతో పాటు మానవసేవను కూడా సమానంగా చేస్తోందని కొనియాడారు. ఆధ్యాత్మికత ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేమని అభిప్రాయపడ్డారు.
ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవలనూ కొనసాగించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వేంకటేశ్వరస్వామి దయతోనే బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డానని తెలిపారు. ప్రపంచానికి సేవలందించే అవకాశం కోసమే తనకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారని అన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలని పిలుపునిచ్చారు.