Donald Trump : బందీల విడుదలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హమాస్ రెబెల్స్ (Hamas Rebels) గ్రూప్‌కు డెడ్‌లైన్ విధించారు. గాజా (Gaza) లో హమాస్ దగ్గర బందీలుగా ఉన్నవారిని వచ్చే శనివారం మధ్యాహ్నం 12 గంటల లోపు విడుదల చేయాలని ఆర్డర్ వేశారు. బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. హమాస్ అతిచేస్తే కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారు.
‘గాజాలో మిగిలి ఉన్న బందీలను తక్షణమే విడుదల చేయాలి. వారందరినీ సురక్షితంగా వెనక్కి పంపించాలి. బందీలను విడుదల చేయకపోతే పరిస్థితి మరింత సంక్షోభానికి దారి తీసే ప్రమాదం ఉంది.’ అని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధ విరమణ ఒప్పందం ప్రకారం.. హమాస్ గత మూడు వారాల నుంచి ప్రతి శనివారం తన వద్ద బందీలుగా ఉన్న వారిని విడుదల చేస్తోంది. గత శనివారం బందీల విడుదల ఉంటుందని అంతా ఆశించారు. బందీల కుటుంబసభ్యులు కూడా వారి కోసం ఎదురుచూశారు.
అయితే హమాస్ గత శనివారం బందీలను విడుదల చేయలేదు. దాంతో బందీల కుటుంబసభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. టెల్ అవీవ్‌లో ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో హమాస్ తక్షణమే బందీలను విడుదల చేయాలని, లేకపోతే తీవ్ర మూల్యం చెల్లించాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల లోపు బందీలను విడుదల చేయకపోతే యుద్ధ విరమణ ఒప్పందం రద్దుకు ఇదే సరైన సమయం అవుతుందని ట్రంప్ హెచ్చరించారు.
అంతేగాక గాజా శరణార్థులను తమ దేశంలోకి రానీయకుండా జోర్డాన్, ఈజిప్ట్ అడ్డుకుంటే అమెరికా నుంచి వారికి అందుతున్న సాయాన్ని నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు. అదేవిధంగా గాజాకు పాలస్తీనియన్ల తిరిగి రాకను అంగీకరించబోమని స్పష్టంచేశారు. కాగా గాజాలో దాదాపు 15 నెలల పాటు యుద్ధం కొనసాగిన అనంతరం జనవరి 19 నుంచి హమాస్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధ విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది.
ఈ ఒప్పందం ప్రకారం హమాస్ రెబెల్స్ ఇప్పటి వరకు 21 మంది బందీలను విడుదల చేశారు. వారిలో 16 మంది ఇజ్రాయెల్ పౌరులు, ఐదుగురు థాయ్ పౌరులు ఉన్నారు. అందుకు బదులుగా వందలాది మంది పాలస్తీనా బందీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. కాగా ఇప్పటికి 70 మందికి పైగా బందీలు గాజాలో హమాస్ చెరలో ఉన్నారు. వారి విడుదలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ట్రంప్ చేసిన హెచ్చరికలు గాజాలో మరింత ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉంది.
Amanatullah Khan | పోలీసులపై దాడి కేసు.. ఆప్ ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం
Bandla Ganesh | నోటి దూలతో సమస్య రావడం దారుణం.. విశ్వక్సేన్ లైలా వివాదంపై బండ్ల గణేశ్
Balkampet Temple | బల్కంపేట ఆలయంలో నకిలీ శీఘ్రదర్శన టికెట్లు.. ఉద్యోగిపై వేటు
Peanuts With Skin | పల్లీలను పొట్టుతో తినాలా..? పొట్టు తీసేసి తినాలా..? ఎలా తింటే మంచిది..?