Peanuts With Skin | పల్లీలను పోషకాలకు గనిగా పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అయితే పల్లీలను పొట్టుతో తినాలా, పొట్టు తీసేసి తినాలా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. ఇందుకు ఆరోగ్య నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారంటే.. పల్లీలు తక్షణ శక్తిని అందజేస్తాయి. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలను అందిస్తాయి. శరీరం యాక్టివ్‌గా ఉండేందుకు కావల్సిన శక్తిని అందజేస్తాయి. అలాగే కండరాలన రిపేర్ చేస్తాయి. పల్లీల్లో ఫైబర్, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. ఆహారం తక్కువగా తినేలా చేస్తాయి. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. పల్లీల్లో ఫోలేట్, మెగ్నిషియం తదితర పోషకాలు కూడా సమృద్ధిగానే ఉంటాయి.
చాలా మంది పల్లీలను తినేందుకు ఇష్టపడుతుంటారు. కానీ పల్లీలను పొట్టు తీసి తింటుంటారు. అయితే పల్లీలను పొట్టుతో సహా తినాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పల్లీల పొట్టులో మన శరీరానికి కావల్సిన అనేక యాంటీ ఆక్సిడెంట్లతోపాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుందని అంటున్నారు. కనుక పల్లీలను పొట్టుతో సహా తినాలని సూచిస్తున్నారు. పల్లీల పొట్టులో రెస్వెరెట్రాల్, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పల్లీల పొట్టులో ఉండే సమ్మేళనాలు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
పల్లీల పొట్టులో ఉండే పాలిఫినాల్స్, రెస్వెరెట్రాల్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో కణాలు డ్యామేజ్ అవకుండా ఉంటాయి. దీని వల్ల తీవ్రమైన గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా రక్షించుకోవచ్చు. పల్లీల పొట్టులో ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం సమస్య ఉన్నవారు నిత్యం పల్లీలను పొట్టుతో సహా తింటుంటే ఫలితం ఉంటుంది. పల్లీలను పొట్టుతో సహా తింటుంటే పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉంటాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది.
పల్లీల పొట్టులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను పెంపొందిస్తుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్తి సమస్య ఉండదు. పల్లీల పొట్టులో ఉండే ఫైబర్, పాలిఫినాల్స్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. భోజనం చేసిన వెంటనే షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. పల్లీల పొట్టులో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లు, క్రిములకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రోగాలు రాకుండా చూస్తుంది. ఇలా పల్లీలను పొట్టుతో సహా తింటే అనేక లాభాలను పొందవచ్చు. అయితే పల్లీలను పొట్టుతో తింటే కొందరికి జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే కొందరు అలర్జీల బారిన పడే చాన్స్ ఉంటుంది. ఇలాంటి వారు పల్లీలను అసలు తినకపోవడమే మంచిది.