USAID | ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ (USAID) ద్వారా ప్రపంచ దేశాలకు అందుతున్న సాయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవలే నిలిపివేసిన విషయం తెలిసిందే. మన దేశంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈ సంస్థ ద్వారా భారత్‌కు అందుతున్న రూ.182 కోట్ల (21 మిలియన్ డాలర్లు) సాయాన్ని కూడా నిలిపివేశారు. ఈ క్రమంలో ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2 వేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై (USAID workers) వేటు వేశారు.
ప్రపంచవ్యాప్తంగా కేవలం కొంతమందిని మినహాయించి మిగిలినవారికి బలవంతపు సెలవులు ప్రకటించారు. ఈ విషయం యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వెబ్‌సైట్‌లోని నోటీసు ద్వారా తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు ఫెడరల్ జడ్జి అనుమతించిన తర్వాత యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై వేటు విషయంలో ట్రంప్ యంత్రాంగం ముందుకెళ్లినట్లు తెలిసింది. తమ తొలగింపు నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరిన ఉద్యోగుల విజ్ఞప్తిని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి కార్ల్ నికోలస్ తిరస్కరించారు.
కాగా, రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప.. ప్రభుత్వం చేసే అనవసరపు ఖర్చులను తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) శాఖను ఏర్పాటు చేశారు. దీని బాధ్యతలను టెస్లా బాస్ ఎలాన్ మస్క్‌కు అప్పగించారు. డోజ్ బాధ్యతలు చేపట్టిన మస్క్.. ఖర్చు తగ్గింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఇప్పటికే అనేకమంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై వేటు వేసిన విషయం తెలిసిందే.
కాగా, USAIDలో ప్రస్తుతం 10వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు యూఎస్ మీడియా తెలిపింది. ఈ సంఖ్యను 300 దిగువకు తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ క్రమంలో 9,700 మందికిపైగా ఉద్యోగులను తొలగించేందుకు ట్రంప్ యంత్రాంగం ప్లాన్ చేస్తోంది. కేవలం 294 మంది మాత్రమే ఏజెన్సీలో పనిచేసేలా ట్రంప్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. వీరిలో 12 మంది ఆఫ్రికా బ్యూరో, ఎనిమిది మంది ఆసియా బ్యూరోలో ఉండేలా సవరణలు కూడా చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Also Read..
“USAID | భారత్‌లో ట్రంప్ ప్రకంపనలు.. ఎన్నికల్లో అమెరికా సాయంపై దుమారం”
“Donald Trump | ట్రంప్ మరో కఠిన నిర్ణయం.. ఆ సంస్థలోని 9,700 మంది ఉద్యోగుల తొలగింపు..!”
“భారత్‌కు యూఎస్ ఎయిడ్ మిషన్ డైరక్టర్‌గా వీణా రెడ్డి”