USAID | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: భారత్‌కు 21 మిలియన్ డాలర్ల సహాయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర ఆరోపణలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్ల (సుమారు రూ.182 కోట్లు) సహాయాన్ని భారత్‌కు అందించడం ద్వారా 2024 సాధారణ లోక్‌సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుందని వస్తున్న ఆరోపణలపై వివిధ కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ‘నీకది.. నాకిది’ తరహాలో ఇదో కిక్‌బ్యాక్ పథకమని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు.
మస్క్ ఆధ్వర్యంలోని డోజ్ శాఖ చేసిన ఆరోపణలతో అన్ని వేళ్లూ విపక్ష కాంగ్రెస్ వైపు తిరిగాయి. కేంద్రంలోని బీజేపీని గద్దె దించడానికి అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ ద్వారా రాహుల్ గాంధీయే ఆ సహాయాన్ని అందుకున్నారంటూ బీజేపీ నేతలు దాడికి దిగారు. బీజేపీ హయాంలోనే ఇది జరిగిందని ఆరోపణలు రావడంతో దర్యాప్తుకు కేంద్రం ఆదేశించింది
ఈ అంశంపై దర్యాప్తు ఎలా, ఎక్కడి నుంచి ప్రారంభించాలి అనే అంశాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిశీలిస్తున్నది. మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేద్దామంటే దీనికి సంబంధించి దేశంలో ఇంతవరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అందుకే సీబీఐ, పోలీసు శాఖల సహాయం తీసుకోవాలని ఈడీ యోచిస్తున్నది.
ఈ నిధుల అంశంపై భారత్‌లో రాజకీయ దుమారం చెలరేగింది. అమెరికా ఆరోపణలపై ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా చర్య భారత్ ఎన్నికలలో జోక్యం చేసుకోవడమేనని ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. ఇది రాజకీయ విమర్శలకు కూడా తావిచ్చింది. ఈ అంశం వెల్లడి వెనుక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది. యూఎస్‌కు చెందిన ఫైనాన్సియర్ జార్జి సోరోస్‌తో కుమ్మక్కై ప్రధాని మోదీపై ద్వేషాన్ని సృష్టించడం ద్వారా భారత దేశ ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నదని విమర్శించింది. భారత్‌లో డీప్ స్టేట్ ఆస్తులను నిలబెట్టుకోవడానికి ఈ నిధులను వినియోగించారని బీజేపీ ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు అవసరమని బీజేపీ నేత ప్రదీప్ భండారి పేర్కొన్నారు.
ఒక పక్క ట్రంప్ ఆరోపణలు భారత్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టించగా, అలాంటిదేమీ లేదని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. భారత్‌కు 21 మిలియన్ డాలర్ల సహాయం చేసినట్టు ట్రంప్ ఆరోపించారని, అయితే దానికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని ఆ పత్రిక ఒక కథనంలో పేర్కొంది. అసలు భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచే పథకం కానీ, దానికి నిధుల సహాయం కానీ ఏమీ లేవని స్పష్టం చేసింది.దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడుతూ బీజేపీని ఓడించడానికి రాహుల్ గాంధీ విదేశీ సహాయం కోరారని ఆ పార్టీ నేతలు చేసిన ఆరోపణలు అబద్ధమని తేలాయన్నారు. ఈ నిజం బయటకు వచ్చిన తర్వాత బీజేపీ నేతలు నీళ్లు నములుతున్నారని విమర్శించారు. వారు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.