గురువారం 04 జూన్ 2020
International - May 18, 2020 , 12:41:45

చర్చిఫాదర్ చేతిలో తుపాకీ.. నవ్వులే నవ్వులు

చర్చిఫాదర్ చేతిలో తుపాకీ.. నవ్వులే నవ్వులు

వాషింగ్టన్: అదేమిటి.. పరమ సాత్వికులుగా మనుగడ సాగించాల్సిన ఫాదర్లు తుపాకీ పట్టడం ఏమిటి? అంటారా.. అబ్బే అది నిజం తుపాకీ కాదండి.. బొమ్మ తుపాకీ. ఇంతకూ అలా బొమ్మ తుపాకీ పట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే.. కరోనాకు దూరం పాటించక తప్పదు. అదొక్కటే మందు అంటున్నారు. కానీ చర్చి ఫాదర్ విశ్వాసులపై పవిత్రజలం చిలకరించాలంటే దగ్గరకు వెళ్లాల్సిందే. శతకోటి కష్టాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు ఓ ఫాదర్ దీనికి విరుగుడు కనిపెట్టారు. తుపాకీ పట్టారు. అమెరికాలోని డెట్రాయిట్ లో నీటిని పిచికారీ చేసే తుపాకీతో పవిత్ర జలాన్ని చిలకరిస్తున్న ఫాదర్ టిమ్ పెల్క్ (70) ఫొటోలు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఫేస్‌బుక్, రెడ్డిట్, ట్విట్టర్ మొదలైన అన్ని సామాజిక మాధ్యమాల్లో బోలెడన్ని షేర్లు, లైకులు ఈ ఫొటో షేర్ అయింది. కొందరు దీనిని ఫొటోషాప్ చేసి వింతవింత వ్యాఖ్యలు కూడా చేర్చారు. కొందరు ఇదే తరహాలో ఫొటోలు దిగి నవ్వులు తెప్పించారు. ట్విట్టర్ లో ఈ పొటో 5.6 లక్షల లైకులు, లక్షకు పైగా రీట్వీట్లు  వచ్చాయి. ఓ డాక్టరుతో చర్చించిన తర్వాత ఈ తుపాకీ ఐడియా వచ్చిందని పాదర్ పెల్క్ చెప్పారు. దీనివల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు అని డాక్టరుతో నిర్ధారించుకున్న తర్వాతనే అమలు చేసినట్టు మీడియాకు వివరించారు.


logo