నీతి, నిజాయితీ, నిబద్ధతతో బీసీలంతా సంఘటితంగా పోరాడితే రాజ్యాధికారం సాధ్యమవుతుందని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. యాచించే స్థాయి నుంచి రాజకీయంగా శాసించే స్థాయికి ఎదగాలని నేతలు పిలుపునిస్తున్నారు. జనాభాలో బీసీలు అధికంగా ఉన్నప్పటికీ పార్లమెంటులో ప్రాతినిథ్యం లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీలను ఎదగకుండా చేస్తున్న కాంగ్రెస్ నేతల కుట్రలను చేవెళ్ల లోక్‌సభ నుంచే తిప్పికొడదామంటున్నారు. మభ్యపెట్టడం ఇక సాగదని.. ఆధిపత్య వర్గాల పార్టీలకు తేల్చి చెప్పాల్సిన సమయం వచ్చిందని నేతలు పేర్కొంటున్నారు.
మన ఓట్లు మనమే వేసుకుందాం.. అనే నినాదాన్ని అన్ని గ్రామాలకు, బీసీ కులాలకు చేరేటట్లు చేసి మేల్కొలుపుదామని చెబుతున్నారు. బీసీ బిడ్డ కాసానిని గెలిపించే బాధ్యతను బీసీలంతా తీసుకుని కంకణబద్ధులై పనిచేయాలని వారు కోరుతున్నారు. కాసాని గెలుపుతో బీసీల సాధికారతకు నాంది పలకడమేగాక బీసీలోని అన్ని కులాలకు సామాజికంగా న్యాయం జరుగుతుందని బీసీ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.
– రంగారెడ్డి, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ)
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బీసీ బిడ్డ కాసానికి టికెట్ ఇచ్చి బీఆర్ఎస్ ఈ వర్గంపై తన చిత్తశుద్ధిని చాటుకున్నది. జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుని బీసీల్లో ఐక్యతను నిరూపించుకుందాం. ఇతర పార్టీలు బీసీ వర్గాలకు సీటు ఇవ్వకపోవటంతోపాటు.. అవహేళనగా మాట్లాడటం సరికాదు. బీసీలు సైతం ఈ ఎన్నికల్లో విజ్ఞతతో వ్యవహరించాలి.
– శివ, గొట్టిముక్కల, వికారాబాద్
అన్ని కులాల్లో బీసీల ఓట్లే అధికంగా ఉన్నాయి. తక్కువ శాతం ఉన్న కులాల వారు రాజకీయాల్లో రాణిస్తున్నారు. బీసీలను ఎన్నో ఏండ్లుగా అణగదొక్కుతున్నారు. ఇప్పటికైనా బీసీలు ఏకమై అహంకారంతో బీసీలను చులకనగా చేసి మాట్లాడుతున్న నేతలకు బుద్ధిచెబుదాం. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించుకొని బీసీల సత్తా ఏంటో చూపిద్దాం.
– శ్రీనివాస్, గొట్టిముక్కల, వికారాబాద్
బడుగుల కోసం పోరాటం చేసే వ్యక్తి కాసానిని పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల కోసం పోరాటం చేసే వ్యక్తి జ్ఞానేశ్వర్. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నాయకుడు కాసాని గెలుపునకు అందరూ కట్టుబడి ఉండాలి. జ్ఞానేశ్వర్‌ను గెలిపించుకుని అహంకారపూరిత నేతలకు గుణపాఠం నేర్పాలి.
– లక్ష్మప్ప, తాండూరు
బీసీ నేత కాసానిని గెలిపించుకుంటాం. 96 కులాల ఐక్యవేదిక సాక్షిగా పార్లమెంట్ ఎన్నికల్లో జ్ఞానేశ్వర్‌కు మెజార్టీ తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం. ముదిరాజ్‌లకు పార్టీ అండగా ఉన్నది. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ విజయం ఖాయం. ఈ ప్రాంతంపై పూర్తి అనుభవం ఉన్న నేత కాసానిని ఎంపీగా గెలిపించుకుంటే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది.
– శివరాజ్, తాండూరు
పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై బీసీల సత్తా ఏంటో చూపిద్దాం. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. బీసీ నేతకు చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా టికెట్ కేటాయించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేవెళ్ల బరిలో నిలిచిన కాసాని జ్ఞానేశ్వర్ బీసీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు.
– రాజుగౌడ్, హైతాబాద్, షాబాద్ మండలం
చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. బీసీలకు దమ్మూ, ధైర్యం ఉంటే కాసానిని గెలిపించుకోవాలని ఓ నాయకుడు విసిరిన సవాల్‌ను బీసీలంతా గమనించి ఓటు రూపంలో మన సత్తా చాటాలి. గతంలో ఎంపీలుగా ఉన్న నాయకులు సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్న విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు.
– దినేశ్‌యాదవ్, కుమ్మరిగూడ, షాబాద్ మండలం
బీసీ బిడ్డ కాసానిని పార్లమెంట్‌కు పంపి బీసీల ఐక్యతను చాటుతాం. ఏండ్ల కాలం నుంచి బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న కొంతమంది కాసాని జ్ఞానేశ్వర్‌కు టికెట్ ఇస్తే ఎలా గెలిపిస్తారని వెకిలి చేష్టలు చేస్తున్నారు. బీసీ బిడ్డ జ్ఞానేశ్వర్‌కు అండగా ఉంటాం. పార్లమెంట్లో బీసీల అభివృద్ధి కోసం గొంతెత్తే నాయకుడు కాసానిని గెలిపిస్తాం.
– శ్రీధర్‌గౌడ్, గౌడ సంఘం నాయకుడు, పాలమాకుల
బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించి సత్తా చాటుతాం. చేవెళ్లకు ఎంపీ నియోజకవర్గం నుంచి బహుజన బిడ్డ కాసానిని గెలిపించి పార్లమెంట్లో బీసీలకు రావాల్సిన నిధులు తీసుకువచ్చేలా చూస్తాం. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపుతో అగ్రవర్ణాల్లోని కొంతమంది నాయకులకు తగిన బుద్ధి చెబుతాం.
– ఆంజనేయులు ముదిరాజ్, బీసీ నాయకుడు, శంషాబాద్
బహుజనులమంతా ఏకం అవుదాం. కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించుకొని ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. అహంకారపరులు బీసీలకు దమ్ములేదని ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అమ్ముడుపోయేవాళ్లని.. ధైర్యం ఉంటే బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలని సవాల్ విసురుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఏకం చేసి చేవెళ్ల గడ్డపై విజయ కేతనం ఎగురవేద్దాం.
– విజయ్ కుమార్, బీసీ సంఘం నాయకుడు
చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్న ప్రతి బీసీ ఓటరును కలుద్దాం. బీసీల సంక్షేమానికి నిరంతరం కృషి చేసిన కాసానిలాంటి పెద్ద మనిషిని గెలిపించుకుందాం. బీసీలం చీలిపోతే చిన్నచూపు చూస్తారు. అలాంటి పరిస్థితి రాకుండా చూద్దాం. సంఘటితమవుదాం. బీసీల సత్తా చాటుదాం. అత్యధికంగా ఉన్న బీసీలను అగౌరవపరుస్తున్న అహంకారపరులకు గుణపాఠం చెబుదాం.
– ఆనంద్ గౌడ్, గౌడ సంఘం నాయకుడు
బీసీలందరం ఐక్యతతో ఉండి ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్‌కు ఓట్లేసి గెలిపిస్తాం. గతంలో కాసాని జ్ఞానేశ్వర్ 96 బీసీ కులాలను ఏకం చేసేందుకు కృషి చేశారు. కాంగ్రెస్, బీజేపీలు రెడ్డి సామాజిక వర్గాలకు టికెట్లు ఇచ్చారు. రెడ్డీలను ఓడించి కాసానిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం.
– రవిగౌడ్, అంగడి చిట్టంపల్లి, పూడూరు మండలం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు ఖాయం. అయన గతంలోనే ఈ ప్రాంతానికి చెందిన బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచారు. అలాంటి నాయకుడు పార్లమెంట్‌కు వెళ్తే నిరుపేదల సమస్యల పరిష్కారంతోపాటు అభివృద్ధి చెందుతారు. బీసీ నాయకుడికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం అభినందనీయం.
– అశోక్, దేవనోనిగూడెం, పూడూరు మండలం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నాయకులు అహంకారంతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి బీసీలంటే అర్థమయ్యేలా గుణపాఠం చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. బీసీ అభ్యర్థి కాసానికి మద్దతిచ్చి గెలిపించాలి.
– శేఖర్, మాదాపూర్
కులమతాలను అనేక మంది రాజకీయాలకు ముడిపెడుతున్నారు. కుల పిచ్చితో ఇష్టం వచ్చినట్లు ఇతర కులాలను కించపరిచేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీసీల గురించి తమ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కాసానిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బీసీల బలమెంటో తెలియజేస్తాం.
– రవికుమార్, హఫీజ్‌పేట్