మంగళవారం 01 డిసెంబర్ 2020
International - Nov 10, 2020 , 03:12:45

ఫైజర్‌ టీకా భళా!

ఫైజర్‌ టీకా భళా!

  • కరోనా మహమ్మారికి సమర్థంగా అడ్డుకట్ట
  • 90% ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక విశ్లేషణలో వెల్లడి
  • త్వరలోనే అత్యవసర వినియోగానికి దరఖాస్తు

న్యూయార్క్‌, నవంబర్‌ 9: కరోనా వ్యాక్సిన్‌ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ప్రపంచానికి ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ సంస్థలు శుభవార్త అందించాయి. తాము అభివృద్ధి చేస్తున్న టీకా.. కరోనా వైరస్‌ను 90శాతానికిపైగా సమర్థంగా అడ్డుకున్నటు ప్రకటించాయి. అత్యవసర వినియోగానికి ఈ నెల చివరిలోనే అమెరికా నియంత్రణ సంస్థలకు దరఖాస్తు చేయనున్నట్లు పేర్కొన్నాయి. ‘సైన్స్‌కు, మానవాళికి ఈ రోజు ఎంతో శుభదినం. కొవిడ్‌-19ని మా వ్యాక్సిన్‌ సమర్థంగా నిరోధిస్తున్నట్లు ఫేజ్‌-3 ట్రయల్స్‌ ప్రాథమిక ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న వేళ, దవాఖానలు కిక్కిరిపోతున్న సందర్భం లో, ఆర్థిక వ్యవస్థలను తిరిగి తెరిచేందుకు ప్ర పంచదేశాలు ఆపసోపాలు పడుతున్న తరుణంలో కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో మేం కీలక మైలురాయిని చేరుకున్నాం’ అని ఫైజర్‌ చైర్మన్‌, సీఈవో ఆల్బర్‌ బౌర్లా వ్యాఖ్యానించా రు. ప్రపంచ ఆరోగ్య సంక్షోభానికి ముగింపు పలికేందుకు సాయపడటంలో తాము మరో అడుగు ముందుకేసినట్టు పేర్కొన్నారు. వేలమంది వలంటీర్లపై జరిపిన పరీక్షల వివరాలను వచ్చే కొన్ని వారాల్లో  అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అయితే, దాదాపు 44,000 మంది పాల్గొన్న ఈ అధ్యయనంలో కేవలం 94 మంది రికార్డులను విశ్లేషించే ఈ ప్రాథమిక ఫలితాలు ప్రకటించారు. అధ్యయనం పూర్తయ్యే సరికి వ్యాక్సిన్‌ ప్రొటెక్షన్‌ రేట్‌ తగ్గవచ్చని ఫైజర్‌ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చివరి దశ ప్రయోగాల్లో ఉన్న 10 కరోనా వ్యాక్సిన్లలో ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ కూడా ఒకటి. అమెరికాకు చెం దిన మరో కంపెనీ మోడర్నా కూడా ఈ నెల చివరిలో తమ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ధరఖాస్తు చేయనున్నట్లు ప్రకటించింది.

వచ్చే ఏడాదిలో 1.3 బిలియన్‌ డోసులు..

 ‘కరోనా వైరస్‌ను మా వ్యాక్సిన్‌ సమర్థంగా అడ్డుకోగలదని ఫేజ్‌3 ట్రయల్స్‌ ప్రాథమిక విశ్లేషణల్లో వెల్లడైంది. ఇన్నోవేషన్‌, సైన్స్‌, సమిష్టి కృషికి దక్కిన విజయం ఇది. కరోనా సెకండ్‌ వేవ్‌ పంజా విసురుతున్న వేళ, తిరిగి సాధారణ పరిస్థితులకు చేరుకోవడంలో ఈ మైలురాయి అత్యంత కీలకమైనది’ అని బయోఎన్‌ టెక్‌ సహవ్యవస్థాపకుడు, సీఈవో ఉగర్‌ సాహిన్‌  పేర్కొన్నారు. ఫైజర్‌ టీకా మూడో దశ ట్రయల్స్‌ జూలై 27న ప్రారంభమయ్యాయి. 43,538 మంది వలంటీర్లు ఎన్‌రోల్‌ చేసుకున్నారు. నవంబర్‌ 8నాటికి వారిలో 38,995 మందికి వ్యాక్సిన్‌ రెండో డోస్‌ ఇచ్చారు. ప్రస్తుత అంచనాల ప్రకారం, ఫైజర్‌ కంపెనీ ఈ ఏడాదిలోనే దాదాపు 50 మిలియన్‌ డోసులు, వచ్చే ఏడాది 1.3 బిలియన్‌ డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది.