కామ్చట్కా: వరుస భూకంపాలతో (Earthquake) రష్యా వణికిపోతున్నది. గత బుధవారం 8.8 తీవ్రతతో కామ్చట్కా (Kamchatka) ద్వీకల్పంలో భారీ భూకంపం రాగా, జూలై 31న కురిల్ ఐలాండ్లో 6.5 తీవ్రతతో భూమి కంపించింది. ఇక క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం బద్దలవడంతో కామ్చట్కాలో (Krasheninnikov) ఆదివారం భూ ప్రకంపణలు వచ్చాయి. తాజాగా మరోసారి కామ్చట్కాలో భూకంపం వచ్చింది. కామ్చట్కా తీరంలో (Kamchatka Coast) మంగళవారం 6.0 తీవ్రతతో భూమి కంపించింది.
బుధవారం నాటి భూకంపం కారణంగా వచ్చిన సునామీ ప్రభావంతో కామ్చట్కా ఉపఖండంలోని నౌకాశ్రయాలతోపాటు జపాన్ తీరం, అమెరికాలోని హవాయి రాష్ట్ర తీరప్రాంతాలు సముద్రపు నీటిలో మునిగిపోయాయి. మూడు మీటర్ల కన్నా ఎత్తయిన అలలు వరుసగా దాడి చేశాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలు ఎత్తయిన ప్రదేశాలవైపు పరుగులు తీయడంతో అనేక దేశాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. హవాయి రాజధానిలో రోడ్లపై కార్లు, వాహనాలు కొన్ని గంటలపాటు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
కాగా, సుమారు ఆరు శతాబ్దాల కాలం నాటి క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతంలో విస్ఫోటనం సంభవించింది. ఆదివారం జరిగిన ఈ భారీ విస్ఫోటనంతో సుమారు 6 కిలోమీటర్ల ఎత్తువరకు బూడిద, ధూళి ఆకాశంలోకి ఎగిసిపడ్డాయి. గత బుధవారం నాటి భూకంపం ప్రభావం వల్లే ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద తూర్పు దిశగా పసిఫిక్ మహాసముద్రం వైపు కదులుతోందని రష్యా అధికారులు వెల్లడించారు. అదృష్టవశాత్తు అది ప్రయాణిస్తున్న మార్గంలో ఎలాంటి జనావాసాలు లేవని, దాంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు.
ఇప్పటివరకు జనావాస ప్రదేశంలోనూ బూడిద పడినట్లు సమాచారం లేదని రష్యా అధికారులు చెప్పారు. అయితే అగ్నిపర్వతం నుంచి ఇంకా స్వల్ప స్థాయిలో విస్ఫోటనాలు కొనసాగే అవకాశం ఉందని కామ్చట్కా వోల్కానిక్ ఎరప్షన్ రెస్పాన్స్ టీమ్ (KVERT) హెచ్చరించింది. ఈ విస్ఫోటనం జరిగిన సమయంలోనే 7.0 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు తెలిపింది.
Volcano eruption | రష్యాలో శతాబ్ధాల నాటి అగ్నిపర్వతంలో భారీ విస్ఫోటనం
సునామీ భయం భయం.. రష్యాను వణికించిన భారీ భూకంపం