టోక్యో, జూలై 30 : రష్యాకు తూర్పు ప్రాంతంలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీంతో పసిఫిక్ మహాసముద్రంలోని దాదాపు అన్ని దేశాలకు సునామీ ముప్పు ఏర్పడింది. భూకంపం, సునామీ కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్టు ఎటువంటి సమాచారం వెలువడలేదు. సునామీ తీవ్రస్థాయిలో వచ్చే ప్రమాదం ఉన్నందున సముద్ర తీర ప్రాంతాలకు కనీసం ఒకరోజు దూరంగా ఉండాలని అధికారులు ఆయా దేశాల ప్రజలను హెచ్చరించారు. రష్యా కు తూర్పున ఉన్న కామ్చట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు జపాన్ వాతావరణశాఖ వెల్లడించింది. రష్యాలో ఇంత తీవ్రతతో భూకంపం రావడం ఇదే మొదటిసారి.
భూకంపం కారణంగా వచ్చిన సునామీ ప్రభావంతో కామ్చట్కా ఉపఖండంలోని నౌకాశ్రయాలతోపాటు జపాన్ తీరం, అమెరికాలోని హవాయి రాష్ట్ర తీరప్రాంతాలు సముద్రపు నీటిలో మునిగిపోయాయి. మూడు మీటర్ల కన్నా ఎత్తయిన అలలు వరుసగా దాడి చేశాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలు ఎత్తయిన ప్రదేశాలవైపు పరుగులు తీయడంతో అనేక దేశాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. హవాయి రాజధానిలో రోడ్లపై కార్లు, వాహనాలు కొన్ని గంటలపాటు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రష్యాలో పలు భవనాలు కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారని, దీంతో పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. సునామీ ప్రభావం 24 గంటల పాటు ఉండవచ్చని, అలాస్కా, హవాయి, ఓరెగావ్ రాష్ర్టాల ప్రజలు తీరానికి దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సునామీ తీవ్రత తగ్గడంతో జపాన్, రష్యా, అమెరికాలోని పలు ప్రాంతాల్లో హెచ్చరికలను ఉపసంహరించారు.
సునామీ హెచ్చరికలతో జపాన్ పూర్తిగా స్తంభించిపోయింది. 2011లో 9.0 తీవ్రతతో వచ్చిన భూకంపం, దాంతోపాటే వచ్చిన భారీ సునామీతో జపాన్‌లోని అణువిద్యుత్తు కేంద్రం నీట మునిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కొన్ని వేల మంది మరణించగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. తాజాగా వచ్చిన భూకంప కేంద్రం కూడా జపాన్‌లోని హక్వైడోకు 250 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైంది. పడవలు, రైళ్లు, విమానాలను కొన్ని గంటలపాటు నిలిపివేశారు. ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి తాగడానికి నీళ్లబాటిళ్లను అందించారు. సునామీ కారణంగా జపాన్‌లోని అనేక తీరప్రాంతపు పట్టణాల్లో 60 సెంటిమీటర్ల నుంచి మూడు మీటర్ల వరకు అలలు ఎగిసిపడినట్టు అధికారులు తెలిపారు. ఇక అణువిద్యుత్తు కేంద్రంలో పనిచేస్తున్న నాలుగువేల మంది సిబ్బందిని బయటకు పంపారు.
ఆసియాలోని ఫిలిప్పీన్స్ నుంచి లాటిన్ అమెరికాలోని పెరూ దేశం వరకు అన్ని దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఫిలిప్పీన్స్‌లో భారీ అలలు తీరాన్ని తాకే అవకాశం ఉండటంతో ప్రజలను బీచ్‌లకు వెళ్లకుండా నిషేధం విధించారు. మెక్సికో, అమెరికాలోని కాలిఫోర్నియా తీరాలకు సునామీ కొంత ఆలస్యంగా రావచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సముద్రపు అలలు అనూహ్యమైన ఎత్తులో వచ్చి తీరాన్ని తాకవచ్చని న్యూజిలాండ్‌లో హెచ్చరించారు. ప్రజలు నీళ్లకు దూరంగా ఉండాలని చెప్పారు. ఫిజీ, సమోవా, టోంగా, మైక్రోనేషియా, సోలోమన్ దీవుల్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈక్వెడార్, చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా, గవామ్, జార్విస్ దీవులు, జాన్స్టన్ అటోల్, మిడ్వే ఐలాండ్, ఆస్ట్రేలియా, కొలంబియా, ఎల్ సాల్వడార్, గ్వాటమాల, ఇండోనేషియా, నికరాగువా, పనామా, తైవాన్, బ్రూనై, ఉత్తర-దక్షిణ కొరియాలు, మలేషియా, వియత్నాం తదితర దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
భూకంపం కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో కల్లోలం ఏర్పడటంతో నీటి మధ్యలో ఉండాల్సిన భారీ తిమింగలాలు జపాన్‌లో తీరానికి కొట్టుకొచ్చాయి. చింబా తీరంలో తిమింగలాలు విసిరివేసినట్టు వచ్చి పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
రష్యాలోని కామ్చాట్కా ప్రాంతంలో ఓ దవాఖానలో వైద్యుల తెగువ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భూకంపం వచ్చినప్పటికీ, ఆపరేషన్ థియేటర్లో వైద్యులు శస్త్రచికిత్సను ఆపలేదు. ప్రకంపనల ధాటికి భవనం మొత్తం ఊగిపోయినా, వైద్యులు భయపడకుండా ఆపరేషన్ పూర్తిచేశారు. స్ట్రెచర్‌ను ఊగకుండా సిబ్బంది గట్టిగా పట్టుకోగా, వైద్యులు ఆపరేషన్ కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.