Sheikh Hasina | గతేడాది బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్ల సమయంలో మానవాళిపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)ను బంగ్లాదేశ్ ఐసీటీ (ఇంటర్నేషన్ క్రైమ్స్ ట్రిబ్యునల్) సోమవారం దోషిగా తేల్చింది. బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి షేక్ హసీనానే అని పేర్కొంది. ఈ మేరకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు సైతం కోర్టు మరణశిక్ష విధించింది.
అషులియా, చంఖర్పుల్లలో ఆరుగురు సహా అనేక చోట్ల నిరసనకారులను పోలీసులు కాల్చి చంపారని ఐసీటీలోని ముగ్గురు న్యాయమూర్తులలో ఒకరు తెలిపారు. ఈ హత్యలకు షేక్ హసీనా ప్రధాన సూత్రధారి అని వ్యాఖ్యానించారు. మృతదేహాలను పోలీసులు దహనం చేశారన్నారు. అంతేకాదు, గతేడాది జూలై-ఆగస్టు నిరసనల సమయంలో షేక్ హసీనా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బలప్రయోగం చేశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. ‘ప్రధాని పదవిలో ఉంటూ ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఆందోళనకారుల్ని చంపాలని ఆమె ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే హెలికాప్టర్లను ఉపయోగించాలని భద్రతా బలగాలకు సూచించారు. అంతేకాదు.. తనకు వ్యతిరేకంగా ఉన్న 226 మందిని చంపాలంటూ తన అనుచరుడు షకీల్‌ను హసీనా ఆదేశించారు’ అని విచారణ సందర్భంగా న్యాయమూర్తులు పేర్కొన్నారు. హసీనా విద్వేషపూరిత ప్రసంగాలతో విద్యార్థులను రెచ్చగొట్టారని కోర్టు పేర్కొంది.
‘విద్యార్థులను ఆమె కిరాతకంగా చంపించారు. వాళ్ల మృతదేహాలను తగలబెట్టాలని పోలీసులను ఆదేశించారు. విద్యార్థి సంఘం నాయకుడు ఒకరు పోలీసుల కాల్పుల్లో మరణించారు. ఆ పోస్ట్‌మార్టం నివేదిక విషయంలోనూ భారీ అవకతవకలు జరిగాయి. ప్రభుత్వ వైద్యుడ్ని బెదిరించి ఐదుసార్లు ఆ నివేదికను హసీనా ప్రభుత్వం మార్పించింది. మాజీ ప్రధానికి గరిష్ట శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్‌వాళ్లు కోరుతున్నారు. వాళ్లు సమర్పించిన ఆధారాలను పరిశీలిస్తే ప్రపంచంలోని ఏ న్యాయస్థానమైన సరే ఆమెకు గరిష్ట శిక్షనే విధిస్తుంది’ అని బెంచ్‌లోని ఓ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇక తీర్పు నేపథ్యంలో ఐసీటీ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read..
Sheikh Hasina | షేక్ హసీనాపై నేడు కీలక తీర్పు.. బంగ్లాలో హై అలర్ట్