Donald Trump | అమెరికాలో ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) కేసుకు సంబంధించిన ఫైల్స్ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెనక్కి తగ్గారు. కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను బహిర్గతం చేసే బిల్లుకు మద్దతు ఇవ్వాలని హౌస్ రిపబ్లికన్లను ట్రంప్ కోరారు. ‘హౌస్ రిపబ్లికన్లు (House Republicans) ఎప్స్టీన్ ఫైళ్లను బహిర్గతం చేసేందుకు మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే.. ఇక్కడ మనం దాచడానికి ఏమీ లేదు’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
కాగా, కొంతకాలంగా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ట్రంప్.. ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎప్స్టీన్ ఫైల్స్ (Epstein Files) బహిర్గతం చేయాలనే అంశంపై రిపబ్లికన్ పార్టీలోనే తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈ విషయంలో ట్రంప్‌కు సొంత పార్టీనేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. ‘దాదాపు 100 మందికి పైగా రిపబ్లికన్లు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంది. వీటో చేయలేని మెజారిటీ సాధిస్తాం’ అని రిపబ్లికన్ సభ్యుడు థామస్ మాస్సీ ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఈ బిల్లు విషయంలో ట్రంప్ మాట మార్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ వారంలోనే ఎప్స్టీన్ ఫైల్స్ (Epstein Files) బహిర్గతానికి సంబంధించిన బిల్లు ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) సెక్స్ కుంభకోణం కేసు అమెరికాను కుదిపేసింది. తన పరపతి పెంచుకోవడం కోసం జెఫ్రీ ఏళ్ల తరబడి టీనేజ్ అమ్మాయిలను ఎరగా వేశాడు. 2002-2005 మధ్య కాలంలో మైనర్ బాలికలను, యువతులకు డబ్బు ఆశ చూపించి తన మాన్‌హట్టన్ భవనం, పామ్ బీచ్ ఎస్టేట్, ఫ్లోరిడా, న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలతో 2019 జులైలో ఎప్స్టీన్ను అరెస్ట్ చేశారు. ఇక అదే ఏడాది ఆగస్టు 10న మాన్‌హట్టన్ జైలు గదిలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన సన్నిహితుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సహా, మాజీ అధ్యక్షులు, రాజకీయ, వ్యాపార వేత్తలు కూడా ఉన్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎప్స్టీన్కు సబంధించిన అన్ని అంశాలు బహిర్గతం చేయాలని ఇటీవల అమెరికా న్యాయ శాఖ ఆదేశాలు ఇవ్వడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది.
Also Read..
Digital Arrest | సీబీఐ అధికారులమంటూ.. మహిళ నుంచి రూ.32 కోట్లు కాజేసిన నేరగాళ్లు
Nitish Kumar | సీఎంగా నితీశే కొనసాగుతారు.. బీహార్ బీజేపీ చీఫ్
Bihar | 20న బీహార్‌లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం.. హాజరుకానున్న ప్రధాని మోదీ