వాషింగ్టన్: భారత సంతతి కుటుంబాలకు చెందిన రెండు వృద్ధ జంటలు అమెరికాలో అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఐదు రోజుల తర్వాత కారు ప్రమాదంలో వారు మరణించినట్లు గుర్తించారు. (Indian origin family Dies in US) అమెరికా సీనియర్ సిటిజన్లు అయిన 89 ఏళ్ల డాక్టర్ కిషోర్ దివాన్, 85 ఏళ్ల భార్య ఆశా దివాన్, 86 ఏళ్ల శైలేష్ దివాన్, 84 ఏళ్ల ఆయన భార్య గీతా దివాన్ కలిసి న్యూయార్క్‌లోని బఫెలో ప్రాంతం నుంచి కారులో బయలుదేరారు. మార్షల్ కౌంటీలోని ప్యాలెస్ ఆఫ్ గోల్డ్‌లో ఉన్న ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రయాణమయ్యారు. ఇస్కాన్ వ్యవస్థాపకుడు స్వామి ప్రభుపాద శిష్యులు అభివృద్ధి చేసిన ప్రసిద్ధ ఆలయానికి చేరుకుని ఆ రాత్రి అక్కడ బస చేయాలని వారు ప్లాన్ వేసుకున్నారు.
కాగా, జూలై 29న పెన్సిల్వేనియాలోని ఎరీలోని పీచ్ స్ట్రీట్‌లో ఉన్న బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లో చివరిసారి వారు కనిపించారు. వారి క్రెడిట్ కార్డ్ చివరి లావాదేవీ కూడా ఇక్కడే జరిగింది. ఆ తర్వాత వారు అదృశ్యమయ్యారు. ఇస్కాన్ ఆలయానికి చేరుకోలేదు. వారి మొబైల్ ఫోన్లు పనిచేయలేదు. ఈ నలుగురు వృద్ధుల అదృశ్యం గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో హెలికాప్టర్లతో సెర్చ్ ఆపరేషన చేపట్టారు.
మరోవైపు ఆగస్ట్ 2న మార్షల్ కౌంటీలోని బిగ్ వీలింగ్ క్రీక్ రోడ్డు నుంచి లోతైన ప్రాంతంలో ఒక కారు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ మారుమూల ప్రాంతానికి చేరుకునేందుకు వారికి ఐదు గంటల సమయం పట్టింది. చివరకు ప్రమాదానికి గురై నుజ్జునుజ్జైన ఆ కారులో నలుగురు భారతీయ సంతతి వృద్ధుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై మార్షల్ కౌంటీ పోలీస్ అధికారి సంతాపం తెలిపారు. కారు ప్రమాదం ఎలా జరిగింది అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Woman, Boyfriend Kill Husband | ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళ.. ఏడాది తర్వాత వెలుగులోకి
Boy Dies By Suicide | వీడియో గేమ్స్‌కు బానిసైన బాలుడు.. ఆత్మహత్యకు పాల్పడి మృతి
Watch: పోలీస్ అధికారి ఇంట్లోకి వరద నీరు.. ఆయన ఏం చేశారంటే?