KTR | వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల్లో జాప్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రజారోగ్యంపై ఎందుకంత నిర్లక్ష్య ధోరణి అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
2021 జూన్ 21వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. 24 అంతస్తులతో రెండు వేలకు పైగా పడకల సామర్థ్యంతో పలు జిల్లాల ప్రజలకు సేవలు అందించేలా ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రూపకల్పన చేశామని తెలిపారు. రెండేళ్లలో 75 శాతం నిర్మాణ పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. 2023 వరకు కూడా ఈ ప్రాజెక్టు వేగంగా సాగిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పనులు నెమ్మదించాయని చెప్పారు. కావాలనే ఈ ఆస్పత్రి నిర్మాణ పనులను ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.
Audacious vision looks like this 👇
India’s largest hospital in Govt sector was grounded in Warangal on 21st June, 2021 by KCR Garu as the CM
To be constructed in 24 Floors with over 2 thousand beds serving people of several districts
75% of the works were completed within 2… pic.twitter.com/jk7uzfLrQ9
— KTR (@KTRBRS) February 27, 2026
ప్రజారోగ్యానికి అత్యంత కీలకమైన ఈ ఆస్పత్రిపై ఎందుకంత నిర్లక్ష్యమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు దీటుగా పేదలకు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించేలా వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రణాళికను కేసీఆర్ ప్రభుత్వం రూపొందించింది. 35 విభాగాలు, వీటిలో 77 యూనిట్ల వారీగా వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేలా డిజైన్ ఉన్నది. గుండె, కాలేయం మార్పిడి, క్యాన్సర్‌ను నయం చేసే కీమోథెరపీ, రేడియేషన్‌తో పాటు అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించేలా నిర్మాణం ఉండనున్నది.
పది సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటు చేసేలా ప్రణాళిక ఉన్నది. సూపర్ స్పెషాలిటీ బెడ్లకు ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యం అందుబాటులో ఉండేలా నిర్మాణ సమయంలోనే ఏర్పాట్లు చేయనున్నారు. అవయవాల మార్పిడి, ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నస్టిక్స్, సర్జికల్, మెడికల్, ఐసీయూ విభాగాలు ప్రత్యేకంగా ఉంటాయి. 500 మంది డాక్టర్లు, వెయ్యి మంది నర్సులు, మరో వెయ్యి మంది పారామెడికల్, ఇతర సిబ్బంది పనిచేయనున్నారు. శస్త్ర చికిత్సలు, అత్యవసర సేవల కోసం సెంట్రల్ స్టెరిలైజేషన్ యూనిట్ ఉంటుంది. మొత్తంగా దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రిగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఉండేలా కేసీఆర్ ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది. శరవేగంగా 80 శాతానికి పైగా భవన నిర్మాణ పనులు పూర్తిచేసింది. అవసరమైన యంత్రాలు, పరికరాలు బిగించి 2023 నవంబర్ చివరి వరకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. ఈలోగా ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పనులు పూర్తి చేయకుండా చోద్యం చూస్తున్నది.