Road Roller | హైదరాబాద్ : దొంగలు సహజంగా బంగారం, నగదు, విలువైన సామాగ్రిని దోచుకెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలను కూడా అపహరిస్తుంటారు. కానీ ఈ దొంగలు మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఓ రోడ్డు రోలర్‌ను దొంగిలించారు. ఈ ఘటన జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గుల్బార్గాకు చెందిన అఫ్రోజ్, ముస్తాఫా కలిసి ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో.. దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే సోమవారం రాత్రి అఫ్రోజ్, ముస్తాఫాతో పాటు షేక్ అన్వర్ కలిసి బాలానగర్‌లో నిర్మానుష్య ప్రాంతంలో నిలిపి ఉంచిన రోడ్డురోలర్పై కన్నేశారు. దాన్ని దొంగిలించాలని వారు నిర్ణయించుకున్నారు. దీంతో ఓ రెండు భారీ క్రేన్లను తెప్పించుకున్నారు. క్రేన్ల సహాయంతో డీసీఎంలోకి రోడ్డు రోలర్‌ను ఎక్కించి మహారాష్ట్ర వైపు మళ్లించారు.
ఇక తన రోడ్డు రోలర్ మిస్ అయిందని గ్రహించిన దాని యజమాని జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. 64 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ తర్వాత జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోనే రోడ్డు రోలర్‌ను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. ఈ దొంగతనం కేసులో అఫ్రోజ్, మహ్మద్ ఇబ్రహీం, షేక్ అన్వర్, బళ్ల రామ్ సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. సయీద్ ముస్తాఫా పరారీలో ఉన్నారు.
అయితే దొంగతనం చేసిన రోడ్డురోలర్‌ను మహారాష్ట్రలోని ఓ స్క్రాప్ దుకాణంలో అమ్మేందుకు నిందితులు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. గతంలో దూలపల్లి, పేట్‌బషీరాబాద్ ప్రాంతాల్లో ఓ రోడ్డు రోలర్‌ను దొంగలించి, మహారాష్ట్రలోని జల్నాలో స్క్రాప్ దుకాణంలో అమ్మేసినట్లు నిందితులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Telangana | ఏదీ నాటి దూకుడు.. సంచలనాత్మక కేసుల ఛేదనలో తడబడుతున్న పోలీసులు!
Baby goats | ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలు జననం..! ఆసక్తిగా తిలకిస్తున్న జనం