Telangana | సిటీబ్యూరో, జనవరి 22(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పోలీసులంటే అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాలకు హడల్.. ఎంత చాకచక్యంగా నేరాలు చేసినా హైదరాబాద్ పోలీసులు పట్టుకుంటారనే భయం వారిలో ఉండేది.. ఇదంతా గత పదేండ్ల కిందట వరకు… నేడు ఆ భయం పోయింది. హైదరాబాద్‌లో నేరాలు జరుగొద్దు.. జరిగితే 24 గంటల నుంచి 48 గంటల్లో ఛేదించాలనే పట్టుదలతో పోలీసులు ఆయా కేసులను ఛేదించే వారు. ఇందులో ప్రధానంగా టాస్క్‌ఫోర్స్ కీలకం పాత్ర పోషించేది. నేడు టాస్క్ పెద్దదైనా అంత ఫోర్స్ అందులో కన్పించడం లేదనే వాదన కన్పిస్తోంది.
తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కాల్పుల ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా ఇంకా దొంగల జాడ కనిపెట్టలేకపోవడంలో పోలీసులు విఫలం కావడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ కేసు ఛేదించడానికి శాంతి భద్రతల పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ బృందాలు రంగంలోకి దిగాయి. వీరికి తోడు కర్ణాటక పోలీసులు కూడా ప్రత్యేక బృందాలతో గాలింపు చేస్తున్నారు. ఈ రెండు రాష్ర్టాల పోలీసులకు ఇప్పుడు ఇద్దరు దోపిడీ దొంగలు మోస్ట్‌వాంటెడ్‌గా మారారు.
ఇలాంటి సంచలనాత్మకమైన ఘటనలను ఈజీగా హైదరాబాద్ పోలీసులు ఛేదించి దేశంలోనే బెస్ట్ పోలీసింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వాలు మారినా అదే యంత్రాంగం పనిచేస్తోంది.. అయితే పని చేయడంలోనే అప్పటిలా ఉత్సాహం చూపకపోవడానికి కారణమేమిటీ… ఆయా విభాగాల మధ్య సమన్వయం ఎలా ఉంది, మనకెందుకు ఫలాన టీమ్ అక్కడకు వెళ్లింది కదా అనే ధోరణితో ఒకరిపై ఒకరు వేసుకొని కేసు ఛేదనలో చతికిల పడుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో టాస్క్‌ఫోర్స్ మాదిరిగానే సీసీఎస్ బృందాలు కూడా కీలకంగా పనిచేయాలనే ఆలోచనతో సీసీఎస్‌ను బలోపేతం చేశారు. అయితే సీసీఎస్‌ను బలోపేతం చేసి రెండేండ్లవుతున్నా ఇప్పటి వరకు కీలక కేసులను ఛేదించలేదు, దానికి తోడు అవినీతి, అక్రమాలు గత ఏడాది ముఠా కట్టుకొని విమర్శలకు గురయ్యారు.
నేడు మూడు పోలీస్ కమిషనరేట్లతో పాటు స్థానికంగా ఉండే జూన్‌లు, డివిజన్లలోని ఆయా ఠాణాల మధ్యనే సమన్వయం కొరవడుతుంది. ఇటీవల అఫ్జల్‌గంజ్‌లో జరిగిన కాల్పుల ఘటనలోని నిందితులు కూడా అఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లి, సికింద్రాబాద్ నుంచి గజ్వేల్ వెళ్లేందుకు ప్లాన్ చేసి తిరుమలగిరిలో దిగిపోయినట్లు బయటకు వచ్చింది. ఆ తరువాత రూట్‌పై స్పష్టత రావడం లేదు, సీసీ కెమెరాలు కూడా నగరంలో అక్కడక్కడ పనిచేయకపోవడంతో సమస్య వస్తోంది. దీనికి తోడు దర్యాప్తు విభాగాల మధ్య సమన్వయం కొరవడిందనే విమర్శలు వస్తున్నాయి. ఎవరు కూడా దీనిపై పూర్తి బాధ్యత తీసుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్ పోలీసింగ్‌లో మార్పులు చేసుకున్నాయి. ఒక్కసారిగా నేరాలు పెరగడం, దోపిడీ దొంగతనాలకు నిలయంగా మారడంతో ప్రభుత్వం కండ్లు తెరిచి నగర పోలీస్ బాస్‌ను బదిలీ చేసింది. కొత్తగా వచ్చిన బాస్ ఐదు నెలలుగా పోలీస్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు శ్రమిస్తున్నారు. కొంత వరకు గాడిలో పడినా, పూర్తిస్థాయిలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసే విధంగా పట్టు సాధించేలా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పోలీసు శాఖలో చర్చించుకుంటున్నారు.