కెరీర్ గొప్ప దశలో ఉన్నప్పుడే బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పి హలీవుడ్ వైపు అడుగులు వేసింది అగ్ర కథానాయిక ప్రియాంకచోప్రా. వరుస విజయాల్లో ఉన్నప్పుడు హిందీ చిత్రసీమను వదిలి వెళ్లడం సరైన నిర్ణయం కాదనే మాటలు వినిపించాయి. అయినా అవేవీ లెక్కచేయకుండా హాలీవుడ్లో అడుగుపెట్టి గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది ప్రియాంకచోప్రా. బాలీవుడ్లో సూపర్‌ఫామ్‌లో ఉన్నప్పుడు హాలీవుడ్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయంపై తాజా ఇంటర్వ్యూలో ఈ భామ స్పందించింది. కంఫర్ట్‌జోన్ నుంచి బయటపడినప్పుడే నిజమైన సక్సెస్‌ను చూస్తామని, రిస్క్ అని తెలిసినా తాను ధైర్యంగా హాలీవుడ్‌లోకి వెళ్లానని చెప్పింది.
‘నాకెందుకో హిందీ సినిమా పరిధి చాలా చిన్నగా అనిపించింది. అప్పటికే ఐశ్వర్యరాయ్‌లాంటి తారలకు హలీవుడ్లో మంచి గుర్తింపు వుంది. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని హాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నా. నటిగా నా పరిధిని విస్తరించుకోవాలనే తపనతో పాటు సినిమాలపరంగా కొత్త ప్రపంచాన్ని వీక్షించాలనే పట్టుదలే హాలీవుడ్ వైపు ఆకర్షించింది. కష్టపడే తత్వం, నా శక్తిసామర్థ్యాలపై నమ్మకమే నన్ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది’ అని చెప్పింది ప్రియాంకచోప్రా. ఇటీవలే యాక్షన్ థ్రిల్లర్ ‘ది బ్లఫ్’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది ప్రియాంక. ప్రస్తుతం ఈ భామ తెలుగులో మహేష్‌బాబు సరసన ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.