హైదరాబాద్: హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌ల కూల్చివేతలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పాలసీ ఉంటే పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ ప్రశ్నించారు. అధికారులు చేసే పనులతో తాము ప్రజల మధ్య తిరుగలేకపోతున్నామని చెప్పారు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల కూల్చివేతను పాతబస్తీ నుంచి ప్రారంభించాలన్నారు. హైదరాబాద్ ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మట్లాడుతూ.. మాదాపూర్‌లో కుమారీ అంటీకి ఇచ్చిన మినహాఇంపును అధికారులు పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
చింతల్‌బస్తీలో ట్రాఫిక్ పోలీస్-జీహెచ్ఎంసీ సంయుక్తంగా రోప్ కింద రోడ్డు ఆక్రమించి చేపట్టిన వందకుపైగా నిర్మాణాలను బుధవారం కూల్చివేశారు. ఇండ్లు కోల్పోయిన వారంతా రోజువారీగా పొట్టపోసుకునే చిరు వ్యాపారులే. దీంతో అక్కడకు వచ్చిన దానం నాగేందర్ ఒకింత ఆవేశానికి గురయ్యారు. స్థానిక ఎమ్మెల్యే నోటీసులో లేకుండా కూల్చివేతలు ఎలా చేపడతారు? ఆపకపోతే ఇక్కడే బైఠాయిస్తా.. ఎమ్మెల్యే పదవి పోయినా సరే జేసీబీకి అడ్డంగా కూర్చుంటానని హెచ్చరించారు. ‘దావోస్‌లో ఉన్న సీఎం వచ్చే వరకు రెండ్రోజులు ఆగండి.. ప్రజలకు నేను కదా సమాధానం చెప్పుకోవాల్సింది.. కూల్చివేస్తే బాగుండదు..’ అంటూ ఘాటుగా మాట్లాడారు. కానీ ఇదంతా పది నిమిషాల్లో ముగిసింది. అధికారులు మాత్రం క్షణం పాటు కూడా కూల్చివేతలు నిలిపివేయలేదు. గత 40 ఏండ్లుగా ఇక్కడే ఉంటూ బతుకుదెరువు సాగిస్తున్న తమ షాపులను తొలగిస్తే రోడ్డునపడుతామంటూ స్థానికులు రోదించినా.. అధికారులు కూల్చివేతలను ఆపలేదు.