Anushka Shetty | దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ‘లేడీ సూపర్ స్టార్’గా వెలుగొందిన అనుష్క శెట్టి వివాహ వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొన్నేళ్లుగా ఆమె పెళ్లిపై అనేక ఊహాగానాలు వచ్చినప్పటికీ, ఈసారి మాత్రం ఆమె త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. 44 ఏళ్ల అనుష్క ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వరుడు ఆమె కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త అని, ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన సంబంధమని సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
చాలా కాలంగా అనుష్క పేరు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిపి వినిపిస్తున్నప్పటికీ, వారిద్దరూ కేవలం ప్రాణ స్నేహితులమని పలుమార్లు స్పష్టం చేశారు. తాజా పరిణామాలతో ఈ రూమర్లకు చెక్ పడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు, అనుష్క గత చిత్రం ‘ఘాటి’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆమె ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె కేవలం మలయాళ చిత్రం ‘కథనార్’ షూటింగ్లో మాత్రమే పాల్గొంటున్నారు. ఈ సినిమా పనులు పూర్తయిన వెంటనే ఆమె వివాహం చేసుకునే ఛాన్స్ ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.