Y Satish Reddy | రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్కాములకు కేరాఫ్ గా మారింది. విద్యుత్ శాఖలో ఇప్పటికే చాలా స్కాములు బయటపడ్డాయి. తాజాగా మరో భారీ స్కాం బయటపడిందని.. పీఎం కుసుమ్ స్కీం పేరుతో దాదాపు రూ.600 కోట్ల దోపిడీకి ప్లాన్ చేశారని బీఆర్ఎస్ నాయకులు, రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు.
రైతులకు ఆదాయం వస్తుందని తీసుకొచ్చిన స్కీమును స్కాంగా మార్చేసి.. విద్యుత్ శాఖ మంత్రి, అధికారులు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. రాష్ట్రంలో పీఎం కుసుమ్ స్కీం కింద 6000 మెగావాట్లకు అప్లికేషన్లు వచ్చాయి. అయితే.. ఇందులో వివిధ దశల్లో పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేశారని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఎట్టకేలకు అన్ని అనుమతులు వచ్చాయని సంతోషించే లోపు మరోసారి అధికారులు లబ్ధిదారులకు షాక్ ఇస్తున్నారు.
సోలార్ విద్యుత్ ప్లాంట్ పెట్టాక దాన్ని సబ్ స్టేషన్ కు అనుసంధానించాల్సి ఉంటుంది. అలా అయితేనే వారు ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్ సబ్ స్టేషన్ కు చేరుతుంది. వారు ఉత్పత్తి చేసిన విద్యుత్ కు డబ్బులు వస్తాయి. దీంతో ఇది విద్యుత్ శాఖ పెద్దలకు వరంగా మారింది. గ్రిడ్‌కు అనుసంధానించాలంటే ఒక్కో మెగావాట్‌కు రూ.10 లక్షలు ఇవ్వాల్సిందేనని తెగేసి చెబుతున్నారని లబ్ధిదారుంలంటున్నారు. అంత పెద్ద మొత్తం చెల్లించుకోలేక చాలామంది అలాగే వదిలేశారు. దీంతో ప్లాంట్ నిర్మాణానికి తీసుకున్న అప్పుల భారం పెరిగిపోతోంది. అలాగే సోలార్ విద్యుత్ అమ్ముకుని కాస్తో కూస్తో సంపాదించుకుందామన్న ఆశలు అడియాశలవుతున్నాయి. ఇలా ఒక్కో మెగావాట్ కు రూ.10 లక్షల చొప్పున లెక్కేస్తే దాదాపు రూ.600 కోట్ల రూపాయలు మింగేసేందుకు విద్యుత్ శాఖ పెద్దలు స్కెచ్ వేసినట్టుగా అర్థమవుతోంది. దీనికి విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలి. విద్యుత్ శాఖ మంత్రి ప్రమేయం లేకుండా ఇంత పెద్ద స్కాం జరగడం అసాధ్యమన్నారు.
వేలాది రూపాయలు అధికారులు వసూలు..
తమ వెనక మంత్రి ఉన్నారనే ధీమా అధికారులకు ఉంది కాబట్టే.. ఈ స్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇదొక్కటే కాదు.. ఇదే పీఎం కుసుమ్ లో కెపాసిటీని మార్చుకున్న రైతుల నుండి కూడా వేలాది రూపాయలు అధికారులు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు సింక్రనైజేషన్ కోసం ఏకంగా రూ.10 లక్షలు వసూలు చేస్తున్నారని అంటున్నారు. డబ్బులు ఇచ్చిన వాళ్ల సోలార్ ప్లాంట్లను మాత్రమే సబ్ స్టేషన్ అనుసంధానిస్తున్నారు. అంటే భట్టి విక్రమార్క శాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
విద్యుత్ శాఖ వెంటనే దీనికి సమాధానం చెప్పాలన్నారు. నిర్మాణం పూర్తయిన ప్లాంట్ల సింక్రనైజేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. సోలార్ ప్లాంట్లలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ వృథా కాకుండా చూడాలి. కేవలం విద్యుత్ శాఖనే కాదు.. రాష్ట్రంలో సర్కారు ఏ పని మొదలు పెట్టినా.. అందులో పని కంటే కూడా కాసుల నొక్కేయడమే ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు భారీగా కోతలు పెట్టారు. సింగరేణిలో బొగ్గు మాయం చేశారు. ఇలా.. ఏ పని చేసినా వందల కోట్లు దోచుకోవడం తప్పా.. ప్రజలకు ఉపయోగం మాత్రం లేకుండా పోతోంది. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతీ రోజు నిరూపిస్తోంది.