రఘునాథపాలెం, ఆగస్టు 17: ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన కాంపాటి రాకేశ్ – మాధవి దంపతులకు 2026 మే 9న ఆడబిడ్డ పుట్టింది. పుట్టిన 12 రోజులకే చిన్నారికి గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్టు వైద్యులు తెలుపడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఆర్థిక స్థోమతలేక అల్లాడిపోయారు. ఖమ్మం నగరపాలక సంస్థ (కేఎంసీ)లో శానిటేషన్ విధులు నిర్వహిస్తున్న ఆ చిన్నారి నాయనమ్మ.. ఈ సమస్యను కేఎంసీ కమిషనర్ అగస్త్య దృష్టికి తీసుకెళ్లింది.
స్పందించిన కమిషనర్.. హృదయ స్వచ్ఛంద సంస్థతోపాటు ప్రభుత్వ సాయంతో ఆ పసిబిడ్డ గుండె శస్త్రచికిత్సకు అవసరమైన రూ.14 లక్షలను మంజూరు చేయించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిన సంతోషంతో సోమవారం కేఎంసీ కార్యాలయానికి ఆ శిశువు తల్లి వచ్చి కమిషనర్‌ను కలిసింది. ‘నా బిడ్డ ప్రాణాలు కాపాడిన మీరే.. పేరు పెట్టి ఆశీర్వదించండి సారూ..’ అంటూ వేడుకున్నది. దీంతో కమిషనర్ ఆ చిన్నారిని ఎత్తుకొని ‘జస్వికశ్రీ’ అని నామకరణం చేశారు.