నారాయణఖేడ్, ఆగస్టు 17: పేదింటి ఆడబిడ్డలకు ఆసరాగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ఎగవేసేందుకు కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ఆరోపించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పునరుద్ధరించే దిశగా హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ సోమవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతికి వినతిపత్రం అందజేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల ఆడపిల్లల పెండ్లి భారం కావద్దనే ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. రేవంత్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆ పథకాలు అమలు కాకుండా కోర్టులో పిటిషన్ వేయిం చి కౌంటర్ దాఖలు చేయలేదని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆ పథకమే లేకుండా కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
నల్లవాగు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి ఎండిపోతున్న రైతుల పంటలు కాపాడాలని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి సబ్ కలెక్టర్ ఉమా హారతికి వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టులో పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నప్పటికీ నీటిని విడుదల చేయడం లేదన్నారు. కార్యక్రమంలో కల్హేర్ మాజీ జడ్పీటీసీ నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంసింగ్, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణ్ణగౌడ్, మాజీ సర్పంచ్ ఎంఏ నజీబ్, పండరి పాల్గొన్నారు.