Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో వ్యాపార, వాణిజ్య దుకాణాల మూసివేత టైమింగ్స్‌పై గందరగోళం నెలకొంది. రాత్రి సమయాల్లో ఎన్నింటికి దుకాణాలు మూసివేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు షాపులు తెరిచి ఉంచొచ్చని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ సీఎం మాటలు మాత్రం ఆచరణలోకి రావడం లేదని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒంటి గంట వరకు దుకాణాలు తెరిచి ఉంటున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రాత్రి 11 గంటలకే మూసివేస్తున్నారు.
అర్ధరాత్రి ఒంటి గంట వరకు వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరిచి ఉంచొచ్చని సీఎం ప్రకటించిన తర్వాత కూడా పోలీసులు కొన్ని ప్రాంతాల్లో 11 గంటలకే మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. అర్ధరాత్రి ఒంటి గంట వరకు షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతించామని తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని కొన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని పోలీసులు తెలుపుతున్నట్లు సమాచారం. దీంతో దుకాణదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత షాపులను పోలీసులు మూసివేయిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రకటనలపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో.. పోలీసుల భయంతో రాత్రి 11 గంటలకే దుకాణాలు మూసివేయాల్సి వస్తుందని కొంత మంది వ్యాపారులు వాపోతున్నారు. షాపుల క్లోజింగ్ టైమింగ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాలని దుకాణదారులు డిమాండ్ చేస్తున్నారు. ఏయే దుకాణాలు 11 గంటలకు క్లోజ్ చేయాలి.. ఏయే షాపులను ఒంటి గంటకు తెరిచి ఉంచాలో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఉన్నమాట అంటే ఉలుకిపాటు ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హరీశ్‌రావు
Telangana | నీటి పారుదల శాఖలో 38 మంది విశ్రాంత ఉద్యోగుల కొనసాగింపు..
Kautala | నాడు జాతీయ స్థాయిలో ఉత్తమ వైద్య సేవలు.. నేడు వైద్యులు లేక రోగులు విలవిల!