హైదరాబాద్ : బీఆర్ఎస్ హయాంలో సర్కారు దవాఖానలు ఓ వెలుగు వెలిగాయి. నేను రాను కొడుకో సర్కారు దవాఖానకు అనే నానుడి నుంచి పోదాం పద బిడ్డో సర్కారు దవాఖానకు అనేలా ప్రభుత్వ వైద్య శాలలను తీర్చిదిద్దారు. నేడు కాంగ్రెస్ పాలనలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సౌకర్యాల లేమి, వైద్యుల కొరతతో రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమస్యలకు నిలయాలుగా మారాయి.
తాజాగా కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని కౌటాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో(Kautala Phc) వైద్యులు (Doctors) లేక సాయంత్రం 4 గంటలకే తాళం వేస్తున్నారు. కౌటాల పీహెచ్సీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉత్తమ వైద్య సేవలు అందిస్తూ జాతీయస్థాయిలో వైద్యారోగ్య శాఖ క్వాలిటీ సేవలు అందిస్తున్న జాబితాలో పలుమార్లు చోటు దక్కించుకున్నది. వందల సంఖ్యలో ప్రసవాలు చేసి రికార్డు సృష్టించింది. అర్ధరాత్రి వచ్చినా డెలివరీ చేసేవారు. కానీ ఇప్పుడు సాయంత్రం 4 అయిందంటే చాలు పీహెచ్సీకి తాళం వేస్తున్నారు.
రెగ్యులర్ డాక్టర్లు లేక ఇన్చార్జీల పర్యవేక్షణలో అంతంత మాత్రంగానే వైద్య సేవలు అందుతున్నాయి. ఏప్రిల్ తర్వాత ఇప్పటి వరకు ఒక్క డెలివరీ జరగలేదంటే ఎంత దీనస్థితికి పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దవాఖానల్లో వసతులు కల్పించి మెరుగైన వైద్యం అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.