RS Praveenkumar | ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపింది. ప్రభుత్వ అవినీతిని, కుంభకోణాలను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ అడిషనల్ డీజీపీ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించినందుకు ఆయన సతీమణి లక్ష్మీభాయిని కాంగ్రెస్ సర్కార్ బదిలీ చేసిందని తెలిసిందే. లక్ష్మీభాయిని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ పోస్ట్ నుండి డిపార్ట్మెంట్ ఆఫ్ కో ఆపరేషన్ శాఖలో అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు ఇవాళ ఉదయం కేవలం నిమిషాల్లోనే ఆర్డర్స్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ బదిలీలు జరుగుతున్నాయని.. కానీ అన్నింటికీ తెగించే రాజకీయాల్లో వచ్చామని స్పష్టం చేశారు. రాజకీయంగా తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని.. అందులో భాగంగానే మొదట తన భద్రతను తగ్గించారని ఆరోపించారు. ఆ అంశంపై తాను హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ పాక్షిక ఉపశమనం లభించిందని.. తనకు రిలీఫ్ దక్కడంతో జీర్ణించుకోలేని ఈ కుఠిల ప్రభుత్వం ఇప్పుడు తన సతీమణిని టార్గెట్గా చేసుకున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
ఆమెకు అసలే సంబంధం లేని ఇతర విభాగానికి బదిలీ చేశారని.. ఇటువంటి బెదిరింపు, కక్ష సాధింపు చర్యలకు తాము భయపడేది లేదని హెచ్చరించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాడుతూనే ఉంటామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.