తిరువనంతపురం: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు చెందిన మాజీ కార్యకర్త క్యాన్సర్‌తో మరణించాడు. అతడి కుటుంబ సభ్యులు చేతులెత్తయడంతో ఒక ముస్లిం మహిళ స్వయంగా అంత్యక్రియలు నిర్వహించింది. (Muslim woman cremated RSS worker) కేరళలో మత సామరస్యానికి ఒక ఉదాహరణగా నిలిచిన ఈ సంఘటన కేరళలోని కాసరగోడ్ జిల్లాలో జరిగింది. మంజేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చిగురుపడావు గ్రామానికి చెందిన 64 ఏళ్ల నారాయణన్ తోట్టతోడి, ఆర్ఎస్ఎస్ మాజీ కార్యకర్త. నోటి క్యాన్సర్ కారణంగా ఆ వృద్ధుడు నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడ్డాడు. గ్రామంలోని ఒక షాపు బయట అపస్మారక స్థితిలో పడిపోయాడు. దీంతో ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) స్థానిక నాయకురాలైన 34 ఏళ్ల ఇర్ఫానా ఇక్బాల్, వృద్ధుల కోసం ఒక ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ ‘షేక్ జాయెద్ ఫౌండేషన్’ ద్వారా పేదలు, అనాథలకు సహాయం అందిస్తున్నారు. నారాయణన్ పరిస్థితి గురించి తెలుసుకున్న ఇర్ఫానా ఆసుపత్రిలో ఆయనను కలిశారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
అయితే నారాయణన్‌ను చూసుకోలేమని అతడి సోదరి తెలిపింది. ఇంటికి తీసుకెళ్లడానికి అతడి భార్య, పిల్లలు కూడా ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు వైద్య చికిత్స అందించేందుకు ఇర్ఫానా ముందుకు వచ్చారు. జిల్లా కలెక్టర్ సహాయంతో కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ జూన్ 26న ఆయన మరణించారు.
మరోవైపు నారాయణన్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే ఆర్థిక స్తోమత తమకు లేదని అతని కుటుంబ సభ్యులు, సోదరి ఇర్ఫానాకు తెలిపారు. దీంతో ఆమె స్పందించారు. ఆయన మృతదేహానికి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు. ‘నా ప్రజా జీవితంలో నేను ఒక అసాధారణ పరిస్థితిని ఎదుర్కొన్నా. కానీ ఏమి చేయాలో నిర్ణయించుకోవడానికి నాకు ఏమాత్రం సమయం పట్టలేదు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఆయన అంత్యక్రియలు జరుపాల్సి ఉన్నది. జూన్ 26 మధ్యాహ్నం చిగురుపడావు గ్రామంలోని శ్మశానవాటికలో నేను ఆ అంత్యక్రియలను నిర్వహించా’ అని తెలిపారు.
అయితే ముస్లిం మహిళ మానవతా దృక్పథంతో చేసిన ఈ చర్య వివాదానికి దారితీసింది. జూన్ 29న కాసరగోడ్‌కు చెందిన బీజేపీ నాయకులు ఇర్ఫానా వ్యాఖ్యలను ఖండించారు. ఆర్ఎస్ఎస్ మాజీ కార్యకర్త నారాయణన్ అంత్యక్రియలను ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన ‘సేవా భారతి’ కార్యకర్తలు నిర్వహించినట్లు కాసరగోడ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు ఎం.ఎల్. అశ్విని మీడియాకు తెలిపారు. ఈ సంఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఇర్ఫానా వాడుకుంటున్నారని ఆరోపించారు.
కాగా, తన చర్యకు కట్టుబడి ఉన్నట్లు ఇర్ఫానా తెలిపారు. ‘నేను ఏమి చేశానో ప్రజలే సాక్షులు. అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు మరణించిన వ్యక్తి మతాన్ని గానీ, రాజకీయ అనుబంధాన్ని గానీ నేను పరిగణనలోకి తీసుకోలేదు. పేదలు, అనాథలు కూడా గౌరవప్రదమైన వీడ్కోలుకు అర్హులని నేను నమ్ముతా’ అని మీడియాతో ఆమె అన్నారు.