మూసీలోమొయిన్హర్ట్ మునక!
లక్షన్నర కోట్లతో అందుకున్న ‘మూసీ’ రాగం మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నది. డీపీఆర్ చేయాలంటే అమరావతి గ్రాఫిక్స్ చేసిన సులభం కాదని, సుందరీకరణ అంటే కూల్చినంత తేలిక కాదని ప్రభుత్వానికి అర్థమవుతున్నది. మూసీని ఉద్ధరించేందుకు మాస్టర్‌ప్లాన్ ఇస్తుందంటూ సీఎం రేవంత్ సచివాలయం వేదికగా ఆకాశానికెత్తిన ‘మెయిన్హర్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్' కంపెనీ సాంకేతిక అంశాల్లోకి వచ్చేసరికి మూసీలో మునక వేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
- డీపీఆర్‌పై ఏడాదిన్నరగా సింగపూర్ కంపెనీ మల్లగుల్లాలు
- కంపెనీతో కాదని తేలడంతో రంగంలోకి నీటిపారుదల శాఖ
- ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ చేతుల్లోకి ప్రాజెక్టు
- కంపెనీకి 141 కోట్లు ఇచ్చి, రాష్ట్ర ఇంజినీర్లతో డీపీఆర్ తయారీ
లక్షన్నర కోట్లతో అందుకున్న ‘మూసీ’ రాగం మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నది. డీపీఆర్ చేయాలంటే అమరావతి గ్రాఫిక్స్ చేసిన సులభం కాదని, సుందరీకరణ అంటే కూల్చినంత తేలిక కాదని ప్రభుత్వానికి అర్థమవుతున్నది. మూసీని ఉద్ధరించేందుకు మాస్టర్‌ప్లాన్ ఇస్తుందంటూ సీఎం రేవంత్ సచివాలయం వేదికగా ఆకాశానికెత్తిన ‘మెయిన్హర్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ సాంకేతిక అంశాల్లోకి వచ్చేసరికి మూసీలో మునక వేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మూసీ సుందరీకరణ మొదటి దశకు రూ.7500 కోట్లతో పాలనా అనుమతులు ఇచ్చినా, ప్రాజెక్టు డీపీఆర్‌కు అతీగతీలేకపోవడంతో కంపెనీపై అనుమానాలు వస్తున్నాయి. సింగపూర్ కన్సార్టియానికి కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.141 కోట్లు చెల్లించినా పని కాలేదని తెలిసింది. దీంతో ప్రభుత్వం తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్లను రంగంలోకి దింపినట్టు సమాచారం. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఇబ్బడిముబ్బడిగా కొర్రీలు పెట్టి, ఏపీ తరపున కేంద్రానికి ఫిర్యాదు చేసిన వ్యక్తి, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ చేతుల్లో మూసీ ప్రాజెక్టును పెట్టినట్టు సచివాలయ వర్గాలు తెలిపాయి.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూసీ సుందరీకరణ ప్రాజెక్టును పదే పదే తెరమీదికి తెస్తున్నది. మూసీ పునర్జీవం పేరుతో హడావుడి చేస్తున్నది. అంతేకాదు మూసీ పరీవాహకంలోని పేదల ఇండ్లను కూల్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు కనీసం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను మాత్రం కొలిక్కి తీసుకురాలేదని తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ పునర్జీవ ప్రాజెక్టుపై దాదాపు మూడు సార్లు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. మొదట రూ.50వేల కోట్ల అంచనా విలువతో మొదలైన ప్రాజెక్టును ఏకంగా లక్షన్నర కోట్లకు తీసుకుపోయారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ‘డీపీఆర్ లేకుండా అంచనా విలువ ఎక్కడిది?’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేశారు.
ఇదంతా జరిగి ఏడాదిన్నర దాటింది. అయినా ఇప్పటివరకు మూసీ ప్రాజెక్టుకు సంబధించి డీపీఆర్‌ను మాత్రం రూపొందించలేకపోయారు. అయినా ఇటీవల రూ.7500 కోట్లతో మొదటి దశ కింద సరోవర్ ప్రాజెక్టు చేపట్టేందుకు పాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అందులో రూ.4100 కోట్లను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) నుంచి రుణంగా సేకరిస్తామని పేర్కొన్నది. సీఎంతోపాటు పలువరు మంత్రులు కూడా మూసీకి ఏడీబీ రుణం ఖరారైందంటూ ప్రకటనలు చేశారు. అయితే ఈ రుణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు డీపీఆర్ లేకుండా అంతర్జాతీయ ఆర్థిక సంస్థ రుణం ఎలా మంజూరు చేస్తుందని మూసీ జనాందోళన్ వంటి సంస్థలు, సంఘాలు, పర్యావరణ వేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తీరా గత కొన్నిరోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా ప్రభుత్వం తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్లను పురమాయించడం చూస్తుంటే మూసీ డీపీఆర్ నిజంగానే ఇంకా తయారుకాలేదని స్పష్టమవుతున్నది.
మెయిన్హర్ట్ ఎంపికలోనే గోల్మాల్
మూసీ ప్రాజెక్టులో కన్సల్టెన్సీగా సింగపూర్‌కు చెందిన మెయిన్హర్ట్ కన్సార్టియంను ఎంపిక చేయడంలోనే పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందంటూ, టెండర్ల సమయంలోనే ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించింది. ముఖ్యంగా ఏపీలోని రాజధాని అమరావతి గ్రాఫిక్స్‌లో ఈ సిం గపూర్ కంపెనీది అందెవేసిన చెయ్యి అని కూడా ఆధారాలతో సహా బయటపెట్టింది. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియలోనే అవకతవకలు జరిగిన పరిణామాన్ని కూడా వివరించింది.
గ్రాఫిక్స్‌తోనే గడిపిన మెయిన్హర్ట్
మూసీ పునర్జీవ ప్రాజెక్టుకు సంబంధించి సర్వే, డీపీఆర్, ప్రాజెక్టు పర్యవేక్షణ, మాస్టర్‌ప్లాన్ వంటి సేవలు అందించేందుకుగాను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సింగపూర్‌కు చెందిన మెయిన్హర్ట్ కంపెనీకి బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 2024 అక్టోబర్ 5న మెయిన్‌హార్ట్ కన్సార్టియంకు ఎంఆర్డీసీఎల్ చీఫ్ ఇంజినీర్ ఎల్ఓఏను జారీ చేశారు. అంటే ఇప్పటివరకు దాదాపు 22 నెలల సమయం గడిచింది. కానీ మూసీ ప్రాజెక్టు డీపీఆర్ మాత్రం పూర్తి కాలేదు. కానీ ఇంతకాలం ప్రభుత్వం పలు వేదికలపై మూసీ సుందరీకరణపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్లు ఇచ్చింది. అందులో మాత్రం అందమైన గ్రాఫిక్స్‌తో సియోల్, లండన్, పారిస్ వంటి రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుల ఫొటోలు పెట్టి, ఆ రీతిలో మూసీ పరివాహకం అభివృద్ది చెందుతుందంటూ దృశ్యాలు చూపించారు. కానీ ఒక ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్) రూపొందించాలంటే నదికి సంబంధించి హైడ్రాలజీ వివరాలు, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ తదితర సంక్లిష్టమైన సాంకేతిక అంశాలు ఉండాలి. మెయిన్హర్ట్ సింగపూర్ ప్రైవేటు లిమిటెడ్ కన్సార్టియంకు ఇది పెద్ద సవాల్‌గా మారినట్లుగా తెలుస్తున్నది. అందుకే కొన్నిరోజుల కిందట ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు బాధ్యతను ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌కు అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ తర్వాత నీటిపారుదల శాఖలోని ఇంజినీర్లను మెయిన్హర్ట్ కంపెనీకి సాంకేతికంగా సహకరించాలంటూ పురమాయించినట్లు తెలిసింది.
- మూసీ ప్రాజెక్టు మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ల కోసం ఎంఆర్డీసీఎల్ అధికారులు 2024 ఫిబ్రవరి ఐదో తేదీన టెండర్ నోటీస్ (నెం.05/ఎస్ఈ(ఎంఆర్డీసీఎల్)/2023-24, తేది: 5.2.2024) జారీ చేశారు. ఏడు కంపెనీలు ముందుకొచ్చాయి. అందులో ఐదు కంపెనీలు బిడ్లు కూడా దాఖలు చేశాయి.
- అందులో సాయి కన్సల్టెన్సీ ఇంజినీరింగ్ లిమిటెడ్ కంపెనీ రూ.60 కోట్లకు కోట్ చేసి ఎల్-1గా నిలిచింది. కానీ అధికారులు ఆ టెండర్‌ను రద్దు చేశారు.
- 2024, ఆగస్టు 13న రెండోసారి టెండర్ల ప్రక్రియ చేపట్టారు. అందులో లీ అసోసియేట్స్ (రూ.141 కోట్లు), మెయిన్హర్ట్ కన్సార్టియం (రూ.143 కోట్లు) బిడ్లు దాఖలు చేశాయి.
- అధికారులు ప్రైస్ బిడ్లు తెరిచిన తర్వాత లీ అసోసియేట్స్‌ను సాంకేతికంగా అనర్హత కింద తిరస్కరించారు. ఆపై రూ.141 కోట్లకే మెయిన్హర్ట్ కంపెనీ (మెయినహార్ట్, రియోస్, కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ అనే మూడు కంపెనీల కన్సార్టియం)కి టెండర్‌ను ఖరారు చేశారు.
- ఈ టెండర్లపై వచ్చిన ఆరోపణలపై సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయం వేదికగా మీడియా సమావేశం నిర్వహించి మెయిన్హర్ట్ సింగపూర్ కంపెనీ అంతర్జాతీయంగా చాలా గొప్ప కంపెనీ అని చెప్పుకొచ్చారు. ఆ కంపెనీ చేయని ప్రాజెక్టులను సైతం ఆ కంపెనీ చేసినట్లుగా పవర్‌పాయింట్ ప్రజంటేషన్లో చెప్పారు.
- ఒకవేళ ముఖ్యమంత్రి చెప్పినట్లుగా సింగపూర్ కంపెనీకి అంత సామర్థ్యం ఉన్నట్లయితే తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్లను రంగంలోకి ఎందుకు దింపారనేది ప్రభుత్వానికే తెలియాలి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

