సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ‘మూసీ సుందరీకరణలో భాగంగా గాంధీసరోవర్ ప్రాజెక్టు కోసం అపార్ట్మెంటు ఖాళీ చేయాల్సిందే.. ప్రభుత్వం పరిహారం ఎంత ఇస్తే.. అంత తీసుకోవాల్సిందే.. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది కాబట్టి అపార్ట్మెంట్ను వదిలి వెళ్లాల్సిందే.. ఫ్లాట్లు ఖాళీ చేయం.. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు భూమి ఇవ్వమంటే కుదరదు. ఎక్కడైనా ప్రభుత్వం ప్రాజెక్టులు కడితే భూములు ఇస్తున్నారు కదా? మీరు కూడా ఇవ్వాల్సిందే…’ ఈ మాటలు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నివాసితులతో ప్రభుత్వ అధికారులు అంటున్నవి. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఫేజ్-1లో భాగంగా నిర్మిస్తున్న గాంధీ సరోవర్ కోసం హైదర్షాకోట్లోని మధు పార్క్ రిడ్జి అపార్ట్మెంట్ నివాసితులకు ప్రభుత్వం ఫ్లాట్ వారీగా వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసింది. బాధితుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు ఏకపక్షంగా మాట్లాడుతూ.. ఫ్లాట్లను ఖాళీ చేయాలని ఆదేశిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని మధుపార్క్ రిడ్జ్ నివాసితులు ఆరోపిస్తున్నారు. కొంత మంది ఇప్పటికే ఖాళీ చేసేందుకు అంగీకరించారని మభ్యపెడుతూ.. తమలో తమను విభజించి ఫ్లాట్లు ఖాళీ చేయించాలని చూస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. అభిప్రాయాల సేకరణ కోసం నోటీసులు జారీ చేసి.. విచారణలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. అధికారులు తమ అభిప్రాయాలను చెప్పనీయడం లేదని మండిపడుతున్నారు.
2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తామంటున్నారు కానీ.. భూమి ఇస్తారా? ఫ్లాటుకు ఫ్లాట్ ఇస్తారా? టీడీఆర్ఇస్తారా? అనేదాంట్లో స్పష్టత ఇవ్వడంలేదంటున్నారు. తమ అభిప్రాయాలు నమోదు చేసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉందని… ఫ్లాట్లు ఖాళీ చేయకున్నా తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. అధికారులు ఎంత మభ్యపెట్టినా తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఫ్లాట్లను ఖాళీ చేయబోమని స్పష్టం చేస్తున్నారు. తమ అపార్ట్మెంట్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు.
పోరాటం ఉధృతం చేస్తాం
గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా మధు పార్క్రిడ్జ్ అపార్ట్మెంట్ ఖాళీ చేయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకునేదాకా పోరాటం చేసేందుకు నివాసితులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమ అపార్ట్మెంట్ అనుమతులు, భూసేకరణ నిబంధనలను జత చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో రిట్ పిటీషన్ వేసినట్లు వెల్లడించారు. మధు పార్క్ అపార్ట్మెంట్కు భూసేకరణ నిబంధనలను ఉల్లంఘిస్తూ నోటీసులు జారీచేశారని కోర్టుకు తెలిపినట్లు చెప్పారు. తమకు అన్యాయం జరిగేలా ఫ్లాట్లను ఖాళీ చేయాలని చూస్తే పోరాటం ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.
ప్రజలను నిర్వాసితులను చేస్తూ చేపట్టే ప్రాజెక్టులతో ఎవరికి ఉపయోగం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. పరిహారం విషయంలోనూ ఎలాంటి స్పష్టత లేకుండా కేవలం ఇండ్లను ఖాళీచేయడంపైనే ప్రభుత్వం దృష్టిపెడుతున్నదని ఆరోపిస్తున్నారు. తమను వేధింపులకు గురిచేస్తూ అపార్ట్మెంట్ను సొంతం చేసుకోవాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గేదాకా కొనసాగిస్తామని వెల్లడించారు. ఇప్పటికైనా తమ అపార్ట్మెంట్ జోలికి రాకుండా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.