Rajkummar Rao | బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ రావు కెరీర్లో క్లాసిక్‌గా నిలిచిన ‘షాహిద్’ సినిమా ఎట్టకేలకు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది. దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కించిన ఈ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం, థియేటర్లలో విడుదలైన సుమారు 13 సంవత్సరాల తర్వాత ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది.
మానవ హక్కుల కోసం పోరాడిన ప్రముఖ న్యాయవాది షాహిద్ అజ్మీ నిజ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముంబైలో ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటూ తప్పుడు కేసుల్లో ఇరుక్కున్న నిరుపేదలకు, అమాయకులకు అండగా నిలిచి షాహిద్ చేసిన న్యాయపోరాటం సినిమా ప్రధాన కథాంశంగా సాగుతుంది. సమాజంలో చట్టపరమైన అన్యాయాలను ఎత్తిచూపుతూ సాగిన ఈ కథ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. సమాజం కోసం పోరాడుతూ 2010లో షాహిద్ అజ్మీ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన జీవితంలోని కీలక ఘట్టాలను దర్శకుడు హన్సల్ మెహతా ఎంతో సహజంగా, హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారు.
ఈ చిత్రంలో తన అద్భుతమైన నటనతో రాజ్‌కుమార్ రావు ప్రాణం పోశారు. సినిమా విడుదలైన సమయంలోనే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడంతో పాటు పలు పురస్కారాలను కైవసం చేసుకుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి గాను ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు దక్కాయి. దర్శకుడు హన్సల్ మెహతా ‘ఉత్తమ దర్శకుడిగా’, హీరో రాజ్‌కుమార్ రావు ‘ఉత్తమ నటుడిగా’ జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఓటీటీ బాట పట్టిన ఈ క్లాసిక్ చిత్రాన్ని ఇంటెన్స్ డ్రామాలు ఇష్టపడే ప్రేక్షకులు తప్పకుండా చూడాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు.