మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 10, 2020 , 00:17:42

పరిమితం.. సురక్షితం..

పరిమితం.. సురక్షితం..

అతిగా శానిటైజర్‌ వద్దు 

కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవద్దు

మండే స్వభావంతో అగ్ని ప్రమాదాలు... అనారోగ్యం 

నకిలీలతో మరింత ముప్పు

లాభాల కంటే నష్టాలే అధికం 

సబ్బు వినియోగమే మేలంటున్న వైద్య నిపుణులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: శానిటైజర్‌. మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది.  కరోనా నుంచి రక్షణ పొందేందుకు దీని వాడకం సాధారణమైపోయింది. ఇండ్లు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, దవాఖానలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు.. ఇలా ప్రతి చోట శానిటైజర్ల వినియోగం పెరిగిపోయింది. కానీ, ఇది వైరస్‌ కంటే ప్రమాదకరంగా మారుతున్నది.  అలసత్వం ప్రదర్శిస్తే  అగ్నిప్రమాదాలు....అశ్రద్ధ చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అవసరానికి ఈ ద్రావకం ఉపయోగపడినా.. అతి జాగ్రత్తలతో  అనర్థాలకు దారి తీస్తున్నట్లు తాజాగా విజయవాడ ఘటన ద్వారా తెలుస్తున్నది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందే హెచ్చరించినా.. వాటిని విచ్చలవిడిగా వాడేస్తూ.. ప్రజలు ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారు. శానిటైజర్ల కంటే సబ్బులే బెటర్‌ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అగ్నికి ఆజ్యం పోస్తున్నది... 

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం రెండు రకాల శానిటైజర్లను మాత్రమే వినియోగించాలి. అందులో ఒకటి ఐసో ప్రొపైల్‌ ఆల్కహాల్‌(ఐపీఏ), రెండోది ఇథనాల్‌ ఆధారిత శానిటైజర్‌. ఈ రెండింటికీ మండే స్వభావం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌ సభ్యులు, ప్రముఖ ఫార్మకాలజిస్టు డాక్టర్‌ ఎ. సంజయ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఐపీఏ ఆధారిత శానిటైజర్‌లో 1.45 శాతం గ్లిజరాల్‌, 0.125 శాతం హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, 75 శాతం ఆల్కహాల్‌ ఉంటుందని, ఇక ఇథనాల్‌ ఆధారిత శానిటైజర్‌లో 1.45 శాతం గ్లిజరాల్‌, 0.125 శాతం హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ 80 శాతం ఇథనాల్‌ ఉంటుందని వివరించారు. ఈ రెండు రకాల శానిటైజర్లు మండే స్వభావం కలిగివనే. దీంతో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. 

మార్కెట్లలో మిథనాల్‌ ఆధారిత శానిటైజర్లే.. 

కరోనా నేపథ్యంలో శానిటైజర్ల డిమాండ్‌ పెరిగింది. దీంతో కొన్ని కంపెనీలు తక్కువ ధరకు లభించే మిథనాల్‌తో తయారు చేసి శానిటైజర్లను మార్కెట్లలో విక్రయిస్తున్నాయి.  దీని వల్ల చర్మ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐపీఏ లీటర్‌కు రూ. 250, ఇథనాల్‌  లీటర్‌కు రూ. 49, అయితే మిథనాల్‌  కేవలం లీటర్‌కు రూ.19కే లభిస్తుండటంతో కొన్ని కంపెనీలు ఈ రసాయనంతోనే తయారు చేసి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.  

నకిలీలతో జర భద్రం

సందట్లో సడేమియాలా శానిటైజర్ల వినియోగం పెరుగడంతో కొన్ని నకిలీ శానిటైజర్లను తయారు చేసే ముఠాలు రంగంలోకి దిగాయి.  అందులో ప్రమాదకర రసాయనాలు కలిపి విక్రయిస్తున్నాయి. తోడుపు బండ్లు, ఫుట్‌పాత్‌లపై దుకాణాలు తెరిచి యథేచ్ఛగా నకిలీవి అమ్ముతూ ప్రజల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నాయి. తక్కువ ధరకు వస్తుందని ప్రజలు వీటిని కొనుగోలు చేసి రోగాల బారిన పడుతున్నారు. ఈ నకిలీ దందాపై నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.  ముఠాల ఆటకట్టించే పనిలో నిమగ్నమయ్యారు.

శానిటైజర్లను వినియోగించే, నిల్వ చేసే పద్ధతులు

* వంట గదులు, స్టెరిలైజేషన్‌ రూమ్‌లు, విద్యుత్‌ కంట్రోల్‌ రూమ్‌లలో శానిటైజర్లను నిల్వ చేయరాదు. 

* ఆక్సిజన్‌, గ్యాస్‌ సిలిండర్లు, పెట్రోల్‌ పంపుల వద్ద  పెట్టరాదు

* చేతులకు శానిటైజర్‌ పెట్టుకున్న వెంటనే వంట గదిలోకి వెళ్లరాదు. స్టౌ వెలిగించరాదు. 

* సెల్‌ఫోన్‌లకు శానిటైజర్‌ రుద్దడం వల్ల మంటలు చెలరేగే ప్రమాదముంటుంది.

* శానిటైజర్‌ రుద్దుకొని నేరుగా ఆహార పదార్థాలు తీసుకోరాదు.

* చిన్నపిల్లలకు దూరంగా ఉంచాలి.

మంటకు దూరంగా ఉంచాలి 

శానిటైజర్లను వంట గదులు, ఆక్సిజన్‌, గ్యాస్‌ సిలిండర్లకు దూరంగా ఉంచాలి. ముఖ్యంగా దవాఖానల్లో లీటర్ల కొద్దీ నిల్వచేస్తారు. అలాంటప్పుడు ప్రత్యేక గదుల్లో భద్రపర్చడం ఉత్తమం. పెట్రోల్‌ బంకుల్లో సైతం శానిటైజర్లను పంపులకు దూరంగా ఉంచాలి. చేతులకు శానిటైజర్‌ రుద్దకున్న వెంటనే వంట గదిలోకి వెళ్లి స్టౌ వెలిగించడం, కరెంటు స్విచ్‌లు వేయడం, రోగులకు ఆక్సిజన్‌ పెట్టడం చేయకూడదు. శానిటైజర్ల వల్ల బ్యాక్టీరియా, వైరస్‌ మాత్రమే నశిస్తుంది.  కానీ సబ్బుతో మలినాలు కూడా పోతాయి. సాధ్యమైనంత వరకు సబ్బులనే వినియోగించడం మంచిది. 

- డాక్టర్‌ ఎ. సంజయ్‌రెడ్డి, టీఎస్‌ ఫార్మసీ కౌన్సిల్‌ సభ్యులు, ఫార్మకాలజిస్టు 

సమాచారం ఇవ్వండి

నకిలీ శానిటైజర్లు, ఇతర కరోనా నుంచి రక్షించే పరికరాలు విక్రయిస్తే సమాచారం అందించండి. వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా నకిలీవి అమ్ముతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్‌ 100కు లేదా.. సిటీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. 

- రాధాకిషన్‌రావు, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీlogo