Fee Reimbursement | నేడు హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయంబర్స్మెంట్ సమస్య- భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ (బీసీ జేఏసీ చైర్మన్) బండారు దత్తాత్రేయ (హర్యానా మాజీ గవర్నర్), సిరికొండ మధుసూదనాచారి, ఎల్ రమణ (బీఆర్ఎస్) నెల్లికంటి సత్యం (సిపిఐ) నిజ్జన రమేష్ (టీజేఎస్) తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసి కాంగ్రెస్ బీసీల ద్రోహానికి పాల్పడుతుందని, బీసీలకు అన్యాయం చేయాలని ఉద్దేశంతోనే రాష్ట్ర హైకోర్టులో ఫీజు రియంబర్స్మెంట్ కేసులో కనీసం అడ్వకేట్ జనరల్ హాజరు కాకుండా కావాలనే ఫీజుల రద్దుకు సంబంధించిన తీర్పు రావాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. ఫీజు రీయంబర్స్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తలేదని ఈ విద్యా సంవత్సరం జరిగే ఇంజనీరింగ్ అడ్మిషన్లు ఉత్తీర్ణత అయిన 50వేల మంది బడుగు విద్యార్థులు ఇంజనీరింగ్ కౌన్సిల్ లో పాల్గొనలేదని ఆయన తెలిపారు, ఇటీవల ప్రపంచ బ్యాంక్ భారతదేశంలో మొదటి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ అని ప్రకటిస్తే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖజానా ఖాళీ అనడం వారి దివాలా కోరుతనానికి నిదర్శనం అన్నారు, 9 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రభుత్వ స్పందించడం లేదని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల సత్తా ఏందో చూపించడానికి ఈనెల 20వ తేదీన హైదరాబాదులో విద్యార్థుల మిలియన్ మార్చ్ నిర్వహించి తీరుతామని హెచ్చరించారు ..
హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు తప్ప చేతలు లేవని, మూడు ట్రిలియన్ డాలర్ల ఆదాయం తెలంగాణ రాష్ట్రం సాధిస్తుందని ఒక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పగా మాటలు చెబుతున్నాడని, వారు అనుకున్న మూడు ట్రీలియన్ ఆదాయం రావాలంటే మానవ వనరుల అభివృద్ధి జరగాలని మానవ వనరుల అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరు ఉన్నత విద్యను అభ్యసించి స్వశక్తితో ఎదగాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఉన్నత చదువుకు ఆసరాగా ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసే బాధ్యత ఉండాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ అవినీతి విధానాల వలన రాష్ట్రంలోని 14 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం గంధరగోళంలోకి వెళ్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ శాసన సభ పక్ష నేత సిరికొండ మధుసూదన చారి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల ఉన్నత విద్య పట్ల తీవ్ర నిర్లక్ష్యంతో వ్యహ రిస్తుందని, తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే ఆంధ్ర పాలకుల మెడలు వంచామో అదే స్ఫూర్తితో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఫీజు రియంబర్స్మెంట్ సాధించుకోవాలని అందుకు బీఆర్ఎస్ పార్టీ బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు.
ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని పదేపదే చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి తన మూడు రాష్ట్ర బడ్జెట్ లలో ఎవరెవరికి ఎంత ఇచ్చారో, ఏ పథకానికి ఎంత ఖర్చు చేశారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సిపిఐ ఎంఎల్ సి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా చెందుతుందని, విద్యార్థులు ఒకవైపు ఫీజులు బకాయిలు చెల్లించాలని ఒకవైపు ఉద్యమిస్తుంటే, ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వృధా చేస్తూ మూసి సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ, ఫార్మాసిటీ అంటూ మోసం చేస్తుందని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10వ తేదీన వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల బందుకు పిలుపునిచ్చాయని, ఆ బందుకు, బీసీ ఉద్యమాలకు సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ప్రకటించారు.
విద్యార్థుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అదే అదే విద్యార్థులు ఈ రోజు చదువుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం తగదని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్ అన్నారు. బీసీ విద్యార్థులు చేస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ పోరాటానికి తమ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కార్యనిర్వాహ అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాం కుర్మా, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరసింహ నాయక్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తారకేశ్వరి, బీసీ మేధావుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ రమేష్, కౌలే జగన్నాథం, వరుణ్ కుమార్, నాయకులు సత్యరాజ్ గౌడ్ గౌతమి, దేవిక, ఇంద్రమ్ రజక, మీసాల గణేష్, రాజేశ్వరి, కోటి, బండి గారి రాజు తదితరులు పాల్గొన్నారు.